కరోనా లాక్‌డౌన్ వల్ల దేశంలో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ఆర్‌టీసీ బస్సులు, రైళ్లు, విమానాలతోపాటు ఆటోలు, క్యాబులు, ఇతర రవాణా సౌకర్యాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ రూల్స్‌కు సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో త్వరలో ఆర్టీసీ బస్సులను కూడా ప్రారంభించనున్నారు. మే 17వ తేదీ వరకు దేశవ్యాప్త లాక్‌డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఆ తరువాత ఆర్టీసీ బస్సులు తిరిగేందుకు అనుమతిస్తామని.. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే తెలిపారు. ఇక తెలంగాణలోనూ ఆర్‌టీసీ బస్సులు త్వరలో రోడ్డెక్కనున్నట్లు తెలిసింది.
లాక్‌డౌన్ ఆంక్షలకు సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో మే 15 లేదా 17వ తేదీ తరువాత తెలంగాణలో మొదటగా హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సులను నడిపిస్తారని తెలిసింది. మే 15వ తేదీన రివ్యూ మీటింగ్ అనంతరం అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే సీఎం కేసీఆర్ చెప్పిన తరుణంలో.. ఆ తరువాతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సులు తిరుగుతాయని తెలుస్తోంది. తరువాత నెమ్మదిగా తెలంగాణ అంతటా ఆర్‌టీసీ బస్సులను నడిపించనున్నారని సమాచారం.
ఇక ఆర్‌టీసీ సేవలు ప్రారంభమైతే బస్సుల్లో సీటుకు ఒక్కరినే కూర్చునేందుకు అనుమతించనున్నారు. అలాగే ప్రయాణికులు మాస్కులను కచ్చితంగా ధరించాల్సి ఉంటుంది. మాస్కులు లేకపోతే బస్సులలోకి అనుమతించరు. ఇక బస్సులు డిపోల నుంచి బయటకు వచ్చేటప్పుడు వాటిని పూర్తిగా శానిటైజ్ చేస్తారు. అలాగే బస్సుల్లోనూ డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికుల కోసం హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు.