హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా పోలీసులు భారీ ఎత్తున ఆంక్షలు విధించారు. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయని అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ ఉదయం 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెబుతున్నారు. సైబర్ టవర్స్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, జేఎన్‌టీయూ, మైండ్ స్పేస్ ఫ్లై ఓవర్స్, దుర్గం చెరువు తీగల వంతెన మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. అలానే ఓఆర్‌ఆర్, పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై కార్లు, జీపులకు అనుమతి లేదని కూడాచెబుతున్నారు.
ఇక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్టెస్ రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం వరకు ఆయా మార్గాల్లో వాహనాల రాకపోకలను నిషేధించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్క్, బీఆర్‌కే భవన్, తెలుగుతల్లి కూడలి, లిబర్టీ జంక్షన్, నల్లగుట్ట రైల్వే వద్ద వాహనాలను దారి మళ్లించనున్నట్లు చెబుతున్నారు. తాజా ఆంక్షల నేపథ్యంలో బేగంపేట ఫ్లైఓవర్ మినహా నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ఫ్లైఓవర్లు రేపు రాత్రి నుంచి జనవరి 1 ఉదయం వరకు మూసివేయనున్నారు.