ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఎక్కువగా బాడీ షేమింగ్ ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకు వచ్చి తాము తమ కెరియర్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఒక్కొక్కటిగా తెలియజేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో.. కామెడీతో ప్రేక్షకులను అలరించిన విద్యుల్లేఖ కూడా తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి మీడియాతో వెల్లడించింది.
వెండితెరపై నవ్వులు కురిపించిన ఈ ముద్దుగుమ్మ.. 2021లో తాను ప్రేమించిన ఫిట్నెస్ నిపుణుడు సంజయ్ ను వివాహం చేసుకుంది . వివాహం అనంతరం హనీమూన్ కోసం మాల్దీవులు వెళ్ళగా ఆ సమయంలో ఆమె బీచ్ లో బికినీలో ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను షేర్ చేయడం పై ఆమెపై చాలా ట్రోలింగ్ జరిగింది. ఒక నెటిజన్ మరీ దారుణంగా శృతిమించుతూ విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారని అడగడంతో ఆమె మనసు నొచ్చుకుంది. డ్రెస్సింగ్ కు విడాకులకు ఏమైనా సంబంధం ఉందా అంటూ అతడిని ఏకిపారేసింది.
ఇకపోతే ఇప్పుడు ఒక బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమైంది.. నేను లావుగా ఉన్నానని.. ఏనుగు, పంది అంటూ జంతువులతో పోల్చుతూ నన్ను ట్రోల్ చేశారు. ఎంత లైట్ తీసుకున్నా ఏదో ఒక పాయింట్ లో అది నన్ను గుచ్చుకుంటుంది. నా హనీమూన్ లో స్విమ్ సూట్ వేసుకున్నానని ఇది అమ్మాయేనా అన్నారు.. తిట్టిపోశారు.. నేను గర్భిణీగా ఉన్నప్పుడు కూడా లావెక్కానని ట్రోల్ చేశారు అంటూ గుర్తుచేసుకుంది. ఏదిఏమైనా ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.