మన దేశ చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని నిర్భయ దోషులు ఇప్పటికే పలుమార్లు ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నారు. ఇక తాజాగా వారు తమ ఉరిశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో పిటిషన్ వేశారు. అయితే అది సరిపోదు అన్నట్లుగా దోషుల్లో ఒకడైన ముకేష్ సింగ్ తాజాగా ఢిల్లీ కోర్టులో మరొక పిటిషన్ వేశాడు. అసలు నిర్భయ ఘటన జరిగిన రోజు తాను ఢిల్లీలోనే లేనని పిటిషన్ వేశాడు.
నిర్భయ ఘటన జరిగిన డిసెంబర్ 16వ తేదీన తాను ఢిల్లీలోనే లేనని ముకేష్ సింగ్ పిటిషన్ వేశాడు. ఈ మేరకు అతను ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టు అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి ధర్మేంద్ర రాణా ఎదుట తన పిటిషన్‌ను ఉంచాడు. 2012 డిసెంబర్ 17వ తేదీన రాజస్థాన్ లో ఉన్న తనను పోలీసులు ఢిల్లీకి తీసుకువచ్చారని, అనంతరం తీహాడ్ జైలులో తనను ఉంచి చిత్రహింసలకు గురి చేశారని, కనుక తాను నిందితున్ని కానని, తనకు మరణశిక్ష రద్దు చేయాలని అతను పిటిషన్‌లో కోరాడు. కాగా ఈ నెల 20వ తేదీన ఉదయం 5.30 గంటలకు నిర్భయ దోషులను ఉరి తీయాలని మార్చి 5వ తేదీన ట్రయల్ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేయగా, తాజాగా దోషులు మరోసారి కోర్టులను ఆశ్రయించారు. దీంతో ఈసారి కూడా ఉరి వాయిదా పడుతుందని భావిస్తున్నారు.
నిర్భయ దోషులకు జనవరి 22, ఫిబ్రవరి 1, మార్చి 2న డెత్ వారెంట్లు జారీ అయినప్పటికీ వారు పలు మార్లు కోర్టులలో విడి విడిగా పిటిషన్లు వేయడంతో వారికి ఉరిశిక్ష వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో వారు చట్టంలో ఉన్న లొసుగులను చాలా తెలివిగా వాడుకుంటూ తప్పించుకుంటున్నారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అసలు వారికి ఉరిశిక్ష అమలవుతుందా, లేదా.. అన్నది సందేహంగా మారింది.