అమెరికా పరిస్థితి కూడా కడు దయనీయం

-

ప్రపంచ సూపర్‌ పవర్‌గా చెప్పుకునే అమెరికా, కరోనావైరస్‌ దెబ్బకు అతలాకుతలమవుతోందని తెలుస్తోంది. అధ్యక్షుల వారు పైకి బీరాలు పలుకుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి క్లిష్టంగా ఉందని అక్కడ పనిచేస్తున్న మన తెలుగు వైద్యురాలు డాక్టర్‌. చైతన్య చెక్కిళ్ల చెబుతున్నారు. తను భారత్‌ గురించి ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేసారు. ఆవిడ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా… ‘మనలోకం’ పాఠకులకు ప్రత్యేకం.

‘‘ నేను డాక్టర్ గా పోస్టులు పెట్టేది చాలా అరుదు. కరోనా వైరస్ గురించి చాలా మంది అజ్ఞానం చూస్తూ మాట్లాడకుండా ఉండలేక రాస్తున్నాను. చెప్పడం నా బాధ్యత కూడా! చెప్పాలంటే చాలా ఉంది కాని ఈ పోస్టులో ముఖ్యమైన విషయాలు రాసే ప్రయత్నం చేస్తాను.

నేను అమెరికాలో ఫ్యామిలీ మెడిసిన్ డాక్టర్ గా పని చేస్తున్నాను. ప్రపంచంలో అత్యంత ఆధునికమైన వైద్య సదుపాయాలు ఉన్నయని చెప్పుకునే అమెరికాలో పరిస్థితికి ప్రత్యక్ష సాక్షిగా చెప్పే విషయాలు ఇవి.రెండు వారాల క్రితం వాషింగ్టన్ లో మొదలై, అన్ని రాష్ట్రాలకు పాకిన కరోనా వైరస్ అమెరికా ని ప్రస్తుతం అతలాకుతలం చేస్తుంది. రెండు వారాలుగా మన ప్లాన్ ఏంటి అని తర్జనభర్జనలు పడుతున్న మా హాస్పిటల్‌లో మార్చ్ 12 న అన్ని healthcare systems లో లాగానే పెనుమార్పులు జరిగినయ్.

ముందు నుండే పరిస్థితిని దగ్గరగా గమనించేవాళ్లకి అర్థమయినా, మొదటిసారి స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి official notice లో వచ్చిన సమాచారం ఒక్కసారిగా అందరినీ ఒక్క కుదుపు కుదిపింది. తీవ్రమైన వ్యాధితో హాస్పిటల్ అడ్మిషన్లు అవసరం ఉన్నవాళ్లను తప్ప కరోనావైరస్ టెస్ట్ చేయడానికి టెస్ట్ కిట్స్ లేవనేది దాని సారాంశం. అంటే కరోనా వైరస్ వచ్చిన వారిలో తేలికపాటి వ్యాధిలక్షణాలు (mild symptoms) ఉండే 80% మందిని టెస్ట్ చేయడానికి ఇప్పటికైతే లేదు. అంటే Covid-19 ఉన్న వాళ్లందరినీ గుర్తించి వేరు (isolate) చేసే అవకాశం లేదు. వాళ్లు యధావిధిగా వైరస్ ని వ్యాపింపచేస్తూ పోతారు. అంటే ప్రస్తుతం న్యూస్ లో చెప్పే నంబర్లన్నీ అర్థం లేనివి. టెస్టులు లేకపోతే పాజిటివ్ లు లేవు కదా! అయితే కొద్ది రోజుల్లో ఎంతమందినైనా టెస్ట్ చేయగలిగే అన్ని కిట్లు వస్తాయి. కానీ జరగాల్సిన నష్టం ఇప్పటికే చాలా జరిగిపోయింది. The horse has left the barn!

పేషెంట్లను గుర్తించి వారిని quarantine చేయలేని ఈ పరిస్థితుల్లో చేయగలిగింది ఒక్కటే. వైరస్ వ్యాప్తిని వీలయినంత తగ్గించడం. అది చేయగలిగింది ‘social distancing’ తో మాత్రమే. అంటే మనుషులను isolate చేయడం, events అన్నింటిని రద్దు చేయడం, మనుషులు సమూహాల్లో, గుంపుల్లో కలవకుండా నివారించడం. ఇందులో ప్రభుత్వాలు ఏం చేయాలి, వైద్య వ్యవస్థ ఏం చేయాలి, ప్రజలు ఏం చేయలి అనేది ఇంకో పెద్ద పోస్టు రాయొచ్చు. అయితే అందరూ వాళ్లు చేయాల్సింది చేయకపోతే ఈ వైరస్ వల్ల కలిగే ప్రాణ నష్టాన్ని అరికట్టే అవకాశం లేదు. We need all hands on deck!

వైరస్ సోకిన అందరినీ టెస్ట్ చేయలేమన్న కొత్త ఎరుకతో మా హాస్పిటల్ సిస్టం లో డాక్టర్లు, మేనేజర్లు, లీడర్‌షిప్ అందరూ అప్రమత్తమయ్యారు. మా క్లినిక్‌లో ఇప్పుడు ప్రత్యక్షంగా పేషెంట్లను చూడడం ఆపేసినం. అత్యవసరమైన వైద్యసదుపాయాలు అవసరమైన వారిని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కి పంపుతున్నాం. మిగిలిన వాళ్లతో ఫోన్ విజిట్స్ చేస్తున్నాం. Regular follow up విజిట్స్ అన్నీ రెండు నెలలు postpone చేస్తున్నాం.

ఇప్పుడున్న పెద్ద ప్రమాదం ఏమిటంటే, వచ్చే రెండు వారాల్లో ఇక్కడి వైద్య వ్యవస్థ కరోనా వైరస్ రోగులను accommodate చేయలేక collapse అవడం. కరోనా వైరస్ రోగులు ఇప్పుడున్న data ని బట్టి ప్రతి ఆరు రోజులకు double అవుతారు. Experts అంచనాల ప్రకారం వచ్చే రెండు వారాల్లో కరోనా సోకిన వారి సంఖ్య ఈ దేశంలో లక్షల్లోకి చేరుతుంది. వైరస్ సోకిన ప్రతి వంద మందిలో 10-20 మందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరమవుతుంది, తక్కువలో తక్కువ అందులో ఇద్దరు చనిపోతారు. అంటే పది లక్షల మందికి వైరస్ వస్తే, లక్ష మందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం అవుతుంది, 20,000 మంది చనిపోతారు. అమెరికాలో సుమారు 45,000 ICU beds, 160,000 ventilators మాత్రమే ఉన్నాయి. రెండు మూడు వారాల్లో ఇక్కడి వైద్య వ్యవస్థ collapse అయ్యే అవకాశం ఉందని అంచనా! ఇటలీలో లాగా ఇక్కడ కూడా వైద్య సదుపాయాలు సరిపోక ఎవరికి ఆక్సిజెన్ ఇవ్వాలి, ఎవరిని ventilator మీద పెట్టాలి అని వైద్యులు చాలా కష్టమైన నిర్ణయాలు తీస్కుకోవాల్సి వస్తుంది. అంటే బతికించే అవకాశం ఉన్నా, సదుపాయాలు లేక బతికించలేని పరిస్థితి. ఇటలీ వలె ఇక్కడ కూడా funeral homes నిరాకరిస్తే బంధువుల మురిగే శవాలతో ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అమెరికాలోని చాలామటుకు హాస్పిటల్లలో ఒక వారం రోజులకన్నా ఎక్కువ సరిపడే మాస్కులు, గౌన్లు లేవని అంచనా! ఆ తర్వాత పరిస్థితి ఏమిటని ఆలోచిస్తేనే భయాందోళనలు కలిగించే పరిస్థితి.

ఇంకో భయానకమైన నిజం ఏంటంటే, అమెరికాలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉండవు. అన్నీ ప్రయివేటువే. కొన్ని మిలటరీ హాస్పిటల్స్‌ మాత్రమే ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పేషెంట్లు ఎక్కువయితే సైనిక ఆసుపత్రులు కూడా ఏమీ చేయలేవు. అమెరికాలోనే పరిస్థితి ఇదయితే ఎక్కువ శాతం ప్రజలకు వైద్యసదుపాయాలు అందుబాటులో లేని ఇండియాలో ఏం జరుగుతుందో ఊహించడం అంత కష్టం కాదు. అందరూ ఈ pandemic ని serious గా తీసుకోవాలని నా మనవి. ఇండియాలో ఉన్న మా అమ్మా నాన్నలకు అత్యవసరమైనతే తప్ప ఇంటి బయటకు వెళ్లొద్దని, ఎవరినీ కలవొద్దని చెప్పిన. ఈ వైరస్ నాకు సోకితే నేను కొంత జ్వరం, దగ్గులతో బాధ పడి కోలుకునే అవకాశాలు ఎక్కువ. కాని 60-70 వయసుల్లో ఉన్నవాళ్లు hospitalize అయే అవకాశం, చనిపోయే అవకాశం ఎక్కువ. Social distancing పాటించి high risk population అయిన older population ని, ఇతర వ్యాధులతో బాధపడుతూ immunity తక్కువ ఉన్న వాళ్లని కాపాడుకుందాం.

COVID-19 నుండి 80% మంది తేలికపాటి symptoms (దగ్గు, జ్వరం)తో కోలుకుంటారు. 10-20 శాతం మందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది. 2-3 % మంది ఈ వ్యాధితో చనిపోతారు. చనిపోయేది చాలామటుకు వృద్ధులు, గుండెజబ్బు, డయబీటీస్ వంటి వ్యాధులు ఉన్నవాళ్లు.

కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ రాకున్నా,  బయటకు వెళ్లకుండా ఎందుకు ఉండాలి? అనుకునేవాళ్లు ఇది అర్థం చేసుకోవడం చాలా అవసరం. Social distancing పాటించకపోతే ఈ pandemic లో వైరస్ బారిన పడిన వాళ్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగి healthcare systems ని overload చేస్తుంది. ఆ పరిస్థిలో డాక్టర్లు, ICU beds, ventilators సరిపోక ప్రాణనష్టం ఎక్కువ జరుగుతుంది.  Social distancing పాటించడం వల్ల ఒకేసారి ఎక్కువ మందికి వైరస్ సోకకుండా నివారించవచ్చు. తద్వారా వీలయినంత మందికి వైద్యం అందించే వీలు ఉంటుంది. pandemic curve ని flatten చేయడం ద్వారా వైరస్ బారిన పడేవారి సంఖ్య తగ్గకపోయినా దేశం లోని వైద్య వ్యవస్థ ఒకేసారి overload కాకుండా ఉంటుంది.

పైన చెప్పిన అంచనాలన్నింటినీ కొంతవరకైనా మార్చే అవకాశం ఉంది. అది మనందరి చేతుల్లో ఉంది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా, ఇతరులను కలవకుండా ఉండి వీలయినంత మంది ప్రాణాలను రక్షించుకుందాం!

– చైతన్య చెక్కిళ్ల, MD

Read more RELATED
Recommended to you

Exit mobile version