ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలి రద్దు నిర్ణయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్నారు. ఆయన ఒకసారి చెప్తే ఆ నిర్ణయం అమలు కావడం తధ్యం. అవును జగన్ చెప్పారు అంటే చేస్తారు. మరి మన భవిష్యత్తు ఏంటీ…? ఇప్పుడు వైసీపీలో చాలా మంది నేతల్లో నెలకొన్న ఆందోళన ఇది. జగన్ ను నమ్మి చాలా పెట్టుబడులు పార్టీ కోసం పెట్టుబడులు పెట్టారు. వారికీ జగన్ హామీ కూడా ఇచ్చారు.
అది పక్కన పెడితే ఇప్పుడు ఇద్దరు మంత్రులకు మాత్రం తమ పదవులకు గండం పొంచి ఉంది అనేది వాస్తవం. మండలిని రద్దు చేస్తే మార్కెటింగ్ శాఖా మంత్రి మోపిదేవి వెంకటరమణ, మరో మంత్రి పిల్లి సుభాష్ ఎమ్మెల్సీలుగా మంత్రులు అయ్యారు. గత ఎన్నికల్లో వాళ్ళు ఓటమి పాలు కావడం, జగన్ కి అత్యంత నమ్మకస్తులు కావడంతో వారిని మండలి ద్వారా జగన్ కేబినేట్ లోకి తీసుకున్నారు.
ఇప్పుడు మండలి తనకు వ్యతిరేకంగా ఉందని జగన్ రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక మండలిని రద్దు చేయడం ఆ ఇద్దరు స్వాగతించారు. మరి ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ఆ ఇద్దరు కేబినేట్ నుంచి వైదొలుగుతారా లేక వారికి వేరే పదవులు ఏమైనా జగన్ ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే వారిలో ఆందోళన ఉందని పదవులు పోతే భవిష్యత్తుపై వారికీ బెంగ ఉందని,
ముఖ్యమంత్రిని నమ్ముకుని వారు రాజకీయాల్లో ఉన్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే మండలిని జగన్ రద్దు చేస్తే చాలా మంది నేతల భవిష్యత్తు అగమ్యగోచరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ సహా కోస్తా ప్రాంతంలో చాలా మంది నియోజకవర్గ స్థాయి నేతలకు ముఖ్యమంత్రి హామీ కూడా ఇచ్చారు. ఈ తరుణంలో వాళ్ళ పదవులు పోతే పరిస్థితి ఏంటీ అనే ఆందోళన వారి అభిమానుల్లో కూడా నెలకొంది.