ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను శాసించేందుకు చినబాబు లోకేశ్ సిద్ధం అవుతున్నారు. ఒకప్పుడు శాసించిన తీరుగానే ఇప్పుడు కూడా తనదైన పంథాలో పార్టీని నడిపి, కొత్త ఉత్సాహం నింపి ముందుకు వెళ్లాలని యోచిస్తున్నారు. ఇందుకు శ్రీకాకుళం కేంద్రంగా కార్యకర్తలకు దిశను నిర్దేశం చేశారు. నిన్నటి వేళ టీడీపీ నాయకుడు కోళ్ల అప్పలనాయుడు (రాజాం నియోజకవర్గ కీలక నేత) కుమార్తె వివాహానికి హాజరైన సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కొన్ని ఆసక్తిదాయక వ్యాఖ్యలు చేశారు.
తాను కేసులకు భయపడను అని, మీరు కూడా అదేవిధంగా ఉండాలని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్కరిపై ఎన్ని కేసులు ఉన్నాయని అడుగుతానని, కేసుల్లేకపోతే వారంతా పార్టీ కోసం, ప్రజల కోసం పోరాటం చేయలేదనే భావిస్తానని ఆకస్తిదాయక వ్యాఖ్యలు చేశారు. వీటిపైనే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ప్రజా పోరాటాలు చేయడంలో మొదట కొంత వెనుకంజలోనే ఉంది. తరువాత వైసీపీ పాలనకు సంబంధించి మూడేళ్లు పూర్తి కావస్తున్నందున మాట్లాడేందుకు కొన్ని కీలక సమస్యలను ఎంచుకుంది. ముఖ్యంగా ధరల పెరుగుదల, ఛార్జీల వడ్డన తదితర అంశాలపై క్షుణ్ణంగా మాట్లాడేందుకు, నిరసనలు తెలిపేందుకు బాదుడే బాదుడు కార్యక్రమానికి సన్నద్ధం అయింది. ఇదంతా బాగుంది కానీ రోడ్డెక్కిన ప్రతి ఒక్కరిపై పోలీసులు కేసులు నమోదు చేయరు. ఏవో కొన్ని ఉద్రిక్తతలకు దారి ఇచ్చిన విధంగా ప్రవర్తిస్తేనే కేసులు నమోదు అవుతాయి.
ముఖ్య నాయకులపై కేసులు వేరు, కార్యకర్తలపై కేసులు వేరు.. ఆ పాటి తేడా కూడా గుర్తించకుండా లోకేశ్ ఏ విధంగా మాట్లాడతారని? ఇవాళ ప్రజా ఉద్యమాలు అన్నవి తీవ్రతరం అయినా కూడా కేసుల వరకూ అవి వెళ్లిన దాఖలాలు లేవు. అంటే ప్రభుత్వం మరీ ! అంతగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన వైనం కూడా లేదు. ఉద్యమాన్ని క్షేత్ర స్థాయిలో అణిచివేయడమో లేదా వీలున్నంత వరకూ హౌస్ అరెస్టుల చేయడమో తప్పించికేసుల వరకూ తీసుకువెళ్తున్న వైనం అన్ని సందర్భాల్లో లేదు. ఒకవేళ కార్యకర్తలపై ఏకపక్షంగా కేసులు నమోదు చేసినా కూడా అవేవీ నెగ్గవు. మరి! లోకేశ్ మాత్రం జైలుకు వెళ్తేనే పోరాటం అన్న విధంగా మాట్లాడడం ఎంత వరకూ సబబు ?