పాకిస్థాన్‌కు ఇంటర్నేషనల్ మానీటరీ ఫండ్ (IMF) బిలియన్ డాలర్ల రుణం మంజూరు చేయడంపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రుణం ఇవ్వడం వల్ల భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గవని తెలిపారు. పూంచ్, రాజౌరి, ఉరి, తంగ్ధర్ ప్రాంతాల్లో దాడి చేసేందుకు వాడుతున్న మందుగుండు సామగ్రి ఖర్చులను ఐఎంఎఫ్ చెల్లిస్తున్నప్పుడు ఉపఖండంలో ఉద్రిక్త పరిస్థితులు ఎలా తగ్గించవచ్చునో అని అంతర్జాతీయ సమాజం ఎలా భావిస్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు.
సరిహద్దుల్లో దాడుల కోసం ఐఎంఎఫ్ నిధులను పాక్ వాడుతుందని ఆరోపించారు. ఐఎంఎఫ్ మంజూరు చేసిన రుణం కారణంగా పాక్ సైనిక చర్యలకు ఊతమిస్తుందని..దాంతో జమ్ము కశ్మీర్‌లో శాంతికి విఘాతం కలిగిస్తుందని విమర్శించారు. సీఎం ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.