కార్తీక మాసం అంటేనే స్నానం, దీపం, దానం, ఉపవాసాలకు ప్రతీతి. దీనిలో స్నానం.. ముఖ్యంగా నదీ స్నానం గురించి తెలుసుకుందాం… సూర్యడు ఉదయించకముందే, నక్షత్రాలు ఇంకా కనిపిస్తుండగానే కార్తీక మాసంలో, భూమి నుంచి వెలువడిన జలాలతో స్నానం చేయాలన్నది నియమం. సహజంగానే కార్తీక మాసం అంటే చలి పెరుగుతుండే సమయం. ఆ మాసాన్ని ఆధ్యత్మిక భావనలు పెంపొందించుకోవడంతో పాటుగా, చలితో కృంగిపోయే శరీరాన్ని దృఢపర్చుకునే విధంగా నియమాలను రూపొందించారు మన పెద్దలు. ఈ మాసంలో ఉదయాన్నే నిద్రలేవమన్న సూత్రాన్ని పాటించడం అంత కష్టం కాకపోవచ్చు. కానీ అసలు బాధంతా స్నానంతోనే ఉంటుంది. వేణ్నీళ్లతో స్నానం చేయవచ్చు కానీ…. శరీరం తన సహజస్థితి నుంచి దూరమవుతుంది. బాహ్య వాతావరణానికి అనుగుణంగా తనని తాను మల్చుకునే అవకాశాన్ని దానికి దూరం అవుతుంది.
నదీస్నానం… విశేషం !
కార్తీక మాసంలో నదీ స్నానాలకి కూడా అనేక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. భారతదేశంలో కురిసే వర్షాలలో మూడొంతులకు పైగా నైరుతి రుతుపవనాల వల్లే ఏర్పడతాయి. వీటి ప్రభావం అక్టోబరు తొలినాటి వరకూ అంటే సుమారుగా ఆశ్వయుజమాసం వరకూ ఉంటుంది. వరద నీటితో పోటెత్తిన నదులన్నీ కార్తీక మాసానికి ప్రశాంత స్థితికి వస్తాయి. నదులతో పాటుగా కొట్టుకువచ్చిన చెత్తాచెదారం అంతా అడుగుభాగానికి చేరుకుని, పైన ఉండే నీరు కాస్తా తేటగా మారుతుంది. నదీ స్నానం చేయడానికి ఇది చాలా ముఖ్యమైన సమయం. ప్రకృతి వడిలోని కొండలు, కోనలు, అడువులు, వృక్షాలనీ రాసుకుంటూ సాగే నదులు, ఆయా ప్రకృతిసిద్ధమైన మూలికలనీ తమలో కలుపుకుని వస్తాయి.అంటే నదీజలాలలో ఉండే ఔషధీగుణాలు కూడా ఈ సమయంలో అధికంగా ఉంటాయి. ఇటువంటి జలంలో స్నానం ఆచరించండం అంటే ఆరోగ్యాన్ని సహజంగా తెచ్చుకోవడం. ఈ మాసంలో ఉదయాన్నే నదుల వద్దకు చేరుకుని సంకల్పం చెప్పుకుని, అరటి దొప్పల్లో దీపం పెట్టి నదుల్లో వదులుతారు. ఎవరి శక్తి అనుసారం వారు దానధర్మాలు చేయాలని, భగవంతుడిని కొలువాలని కార్తీక పురాణం చెబుతోంది. ఇక ఆయా పుణ్యనదులన్నీ కలిసేది సముద్రంలోనే కనుక కార్తీక మాసంలో సముద్ర స్నానం కూడా విశేష ఫలితాన్నిస్తుంది.
– శ్రీ