ఒకే పార్టీకి చెందిన వారిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. వైసీపీ గాలిని సైతం తట్టుకుని ఎమ్మెల్యే సీట్లను పదిలం చేసుకున్నారు. పార్టీ అధికారంలో లేకపోవడంతో ఏడాదిన్నర మౌనంగా ఉన్న వారి మధ్య మళ్లీ ఆధిపత్య పోరు రాజుకుంది. గతంలోలా కాకుండా ఇప్పుడు వారి రాజకీయ వారసులు తలపడే పరిస్థితి వచ్చిందట. గోదావరి తీరంలో ఈ రెండు కుటుంబాల పోరు టీడీపీలో సెగలు పుట్టిస్తుందట..
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి టీడీపీలో గోరంట్ల వర్సెస్ ఆదిరెడ్డి గొడవ మళ్లీ మొదలైంది. పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం మధ్య ఆధిపత్య పోరు రాజుకుంది. రాజమండ్రి రూరల్ నుంచి రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల.. రాజమండ్రి సిటీలోనూ పట్టు సాధించాలని చూస్తున్నారట. దీంతో ఆదిరెడ్డి కుటుంబం ఆధిపత్యానికి ఆయన చెక్ పెడుతున్నారనే ప్రచారం మొదలైంది.
ఇటీవల గోరంట్ల చేసిన కామెంట్స్ పార్టీలో హీట్ పుట్టించాయి. రాజమండ్రి సిటీలో టీడీపీని ఆదిరెడ్డి కుటుంబం తమ జేబు సంస్థగా మార్చేసిందని.. వారికి చెక్ పెట్టేలా రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన వారసుడిగా సోదరుడి కుమారుడు డాక్టర్ రవిరామ్ కిరణ్‌ను బరిలో దించుతున్నట్టు ఆయన ప్రకటించారు. దీంతో రవిరామే టీడీపీ మేయర్ అభ్యర్థిగా ఉంటారనే అంచనాలు మొదలయ్యాయి.
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి అప్పారావు కోడలు ఆదిరెడ్డి భవానీ ఉన్నారు. అప్పారావు ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచీ రెండు వర్గాలకు పడటం లేదు. ప్రస్తుతం గోరంట్ల చేసిన ప్రకటనపై ఆదిరెడ్డి వర్గం భగ్గుమంటోంది. భవానీ భర్త.. ఆదిరెడ్డి వాసు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు. సిటీలో టీడీపీ కార్యక్రమాలను అన్నీ తానై నడిపిస్తున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వాసు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బరిలో దిగుతారని ఆదిరెడ్డి వర్గం భావిస్తోంది. మరికొందరైతే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వాసు ఎంపీగా పోటీ చేస్తారని అనుకుంటున్నారు.
రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు ఎదిగితే రాజకీయంగా తనకు ఇబ్బంది అవుతారని భావించారో ఏమో గోరంట్ల సైతం వేగంగా పావులు కదిపారని సమాచారం. అందుకే రాజకీయ వారసుడిని తెరపైకి తీసుకొచ్చారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. రానున్న రోజుల్లో వాసు ఏ పదవిపై ఆసక్తి చూపితే ఆ పదవికి డాక్టర్ రవిరామ్‌ను తెరపైకి తెచ్చి గోరంట్ల అడ్డుపడొచ్చని ఆదిరెడ్డి వర్గం అనుమానిస్తోందట. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా టీడీపీలో వీరిద్దరి అంశంపైనే వాడీ వేడీ చర్చ జరుగుతోంది. మరి.. ఈ సమస్య ముదురు పాకాన పడకుండా టీడీపీ పెద్దలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.