కర్ణాటకలో రానున్న రోజుల్లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ నేతలకు వ్యతిరేకంగా మారారని ఆయన ఆరోపించారు.ఎమ్మెల్యేలకు నిధులు లేవని, ప్రజల్ని ఎదుర్కొనేందుకు వారు సిగ్గుపడుతున్నారని విమర్శించారు. పరిపాలన అధ్వాన్నంగా ఉందని, అధికారులు ప్రభుత్వం మాట వినడం లేదని, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే స్థాయికి చేరిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
రాష్ట్రంలో పెట్రోల్ ధరల పెంపుపై దావణగెరెలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ….కాంగ్రెస్ ధరల పెంపుతో సామాన్య ప్రజలు, పేదలపై భారం పడుతుందని మండిపడ్డారు. పెట్రోలు, డీజిల్, ఇతర నిత్యావసరాల ధరలు పెంచడం ద్వారా పాలించే నైతిక అధికారాన్ని కోల్పోయారని, సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై రూ. 1.05 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని ఆరోపించారు.