ఓ తమిళ్ సినిమాలో హీరోయిన్ అక్క పురిటి నొప్పులతో బాధపడుతుండగా హీరో విజయ్ వీడియోకాల్ చేసి వైద్యుల సూచనల మేరకు డెలివరీ చేసి రెండు ప్రాణాలను కాపాడుతాడు. అది సినిమా లే ఏమన్నా చేయవచ్చు అనుకుంటాం.. అచ్చుగుద్దినట్టు అదే ఘటనలో ఓ దివ్యాంగుడు రైలులో మహిళకు డెలివరీ చేసి అందరీ ప్రశంసలు అందుకుంటున్నాడు. దివ్యాంగుడైన సునీల్ ప్రజాపతి(30) దీల్లీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన పెళ్లి తేదీ ఖరారు చేసుకునేందుకు శనివారం సొంత రాష్ట్రమైన ముధ్యప్రదేశ్‌కు బయల్దేరాడు. జబల్‌పూర్– మధ్యప్రదేశ్ రైలులో వెళ్తున్న సునీల్‌కు అర్ధరాత్రి ఓ మహిళ గట్టిగా అరుస్తూ, ఏడిచే అరుపులు వినిపించాయి.
బ్లేడ్, శాలువ దారాలతో..
బీ–3 కోచ్‌లోకి పరిగెత్తి చూడగా పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను ఎలాగైలా బగికించాలనుకున్నాడు. తీరా చూస్తే ఆస్పత్రి తీసుకువెళ్లే సమయం కూడా లేదు. దీనికి తోడు సహాయంగా బోగీలో ఒక్క మహిళ కూడా లేదు. ఇక ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయరాదని నిర్ణయించుకొని తన సుపీరియర్ డాక్టర్ సుపర్ణ సేన్‌కు ఫోన్ కలిపాడు. వీడియోకాల్‌లో డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ మహిళకు ప్రసవం చేశాడు. శాలువాకున్న దారాలు, ఓ ప్రయాణికుడి షేవింగ్ కిట్‌లో ఉన్న కొత్త బ్లేడ్ తీసుకుని ఆమెకు డెలివరీ చేశాడు. ఆ తర్వాత మథుర స్టేషన్‌లో రైలు ఆగగానే ఆర్పీఎఫ్ సిబ్బంది తల్లీబిడ్డను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు. సమయస్ఫూర్తి ప్రదర్శించి డెలివరీ చేసిన సునీల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.