‘ఆపరేషన్ సింధూర్’తో సరిహద్దుల్లో ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన భారత్, ఇప్పుడు వారి విషపూరిత ప్రచారానికి కూడా గట్టిగా తాళం వేస్తోంది. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన హృదయ విదారక ఉగ్రదాడి నేపథ్యంలో, భారత ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రతి ఓటీటీ వేదిక, ప్రతి మీడియా స్ట్రీమింగ్ సర్వీస్, ప్రతి డిజిటల్ మధ్యవర్తి ఇకపై పాకిస్తాన్ మూలాలు కలిగిన ఏ ఒక్క వెబ్ సిరీస్‌ను, ఏ ఒక్క సినిమాను, ఏ ఒక్క పాటను, ఏ ఒక్క పాడ్‌కాస్ట్‌ను లేదా మరే ఇతర మీడియా కంటెంట్‌ను ప్రసారం చేయకూడదని కఠినంగా ఆదేశించింది.
మే 8, 2025 నాటి ఈ ఆదేశాలు కేవలం కాగితాలపై రాసిన మాటలు కావు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021లోని పార్ట్ II ప్రకారం ఈ చర్య తీసుకోబడింది. తమ వేదికలపై ప్రసారమయ్యే కంటెంట్ భారతదేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు, జాతీయ భద్రతకు లేదా దేశంలోని శాంతిభద్రతలకు ఏ మాత్రం ముప్పు కలిగించకూడదని ప్రచురణకర్తలు , మధ్యవర్తులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని ఈ ఆదేశాలు సూచిస్తున్నాయి.
భారతదేశంలో జరిగిన అనేక భయంకరమైన ఉగ్రదాడులకు పాకిస్తాన్‌లోని ప్రభుత్వ , ప్రభుత్వేతర శక్తులతో సరిహద్దులు దాటి బలమైన సంబంధాలు ఉన్నాయని భారత ప్రభుత్వం స్పష్టంగా గుర్తించింది. ఈ క్రమంలో, ఏప్రిల్ 22, 2025న పహల్గామ్‌లో అమాయక భారతీయ పౌరులు , ఒక నేపాలీ జాతీయుడు ప్రాణాలు కోల్పోయిన దారుణమైన ఉగ్రదాడిని ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రస్తావించింది. దేశ భద్రత దృష్ట్యా ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ప్రభుత్వం తేల్చి చెప్పింది.