వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీ నేతలతో భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాజంపేట, కుప్పం, మడకశిర, రొద్దం వంటి ప్రాంతాల మున్సిపల్ చైర్‌పర్సన్లు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, పార్టీ నేతలతో సమావేశమై ఆయన మాట్లాడుతూ — “మూడు సంవత్సరాలు గట్టిగా నిలబడి పోరాడితే, తరువాత మన ప్రభుత్వమే తిరిగి వస్తుంది” అని ధైర్యం నింపారు. జగన్ వ్యాఖ్యానిస్తూ, “ఏడాది గడిచినట్లు అనిపించదే.. కళ్లు మూసి తెరిస్తే మూడేళ్లు కరిగిపోతాయి. మనం ఇప్పుడే పట్టుదలగా నిలబడి పోరాడితే, ప్రజల ఆశీర్వాదంతో తిరిగి అధికారంలోకి వస్తాం” అని అన్నారు. “ప్రజలను వేధిస్తున్న వారిని వదిలిపెట్టేది లేదు. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని ఆయన హెచ్చరించారు.
వైఎస్ జగన్ ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, “నాడు–నేడు లేదు, ఇంగ్లిష్ మీడియం లేదు, పిల్లలకు ట్యాబ్‌లు లేవు, గోరుముద్ద సక్రమంగా అందడం లేదు. గవర్నమెంట్ బడులు రివర్స్‌లోకి వెళ్తున్నాయి” అని ఆరోపించారు. పిల్లలు చదువుకోగలగాలంటే కుటుంబం బాగుండాలని, విద్యకు అవసరమైన మౌలిక వసతులు ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
“మన ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు విద్యాదీవెన చెల్లించేది. ఏటా 2800 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, మరో 1100 కోట్లు వసతి దీవెనకు మంజూరు చేసేవాళ్ళం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది కేవలం 700 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఈ ఏడాది అయితే ఏం ఇవ్వలేదు కూడా. దీనివల్ల విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు” అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.