ఉగ్రవాదంపై భారత ప్రతీకార చర్యల నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీను ఒక గొప్ప దార్శనిక నాయకుడిగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కొనియాడారు. కౌటిల్యుడి తత్వాన్ని ఆయన పాలనా విధానంలో ప్రతిబింబింపజేస్తున్నారని తెలిపారు. దేశ రాజధానిలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, “ప్రధాని మోదీ పరిపాలనలో కౌటిల్యుని తత్త్వాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శిస్తున్నారు. భద్రత, రాజనీతి, పాలన.. ఈ మూడు రంగాల్లోనూ ఆయన విధానం సమగ్రంగా ఉంది” అని వివరించారు.
మోదీ దార్శనికత గురించి ధన్‌ఖడ్ మాట్లాడుతూ, “భారీ స్థాయిలో, దీర్ఘకాలికమైన మార్పు కోసం ఆయన కృషి చేస్తున్నారు. దశాబ్దకాలపు నాయకత్వానికి ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి” అని అభిప్రాయపడ్డారు. భారతదేశం శాంతికి నిలువెత్తు ఉదాహరణ అని గుర్తు చేసిన ధన్‌ఖడ్, ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వం, సంక్షేమం కోసం భారతం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. భారత్‌పై దాడి చేసినవారినే లక్ష్యంగా తీసుకుని చర్యలు చేపట్టినట్లు గతంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంలో గుర్తు చేశారు.
ప్రాచీన భారత నాగరికత, ప్రజాస్వామ్యంపై మాట్లాడిన ధన్‌ఖడ్, “భావప్రకటన, వాదవివాదాల సమన్వయం ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు. మన దేశం ప్రజాస్వామ్య పునాది వేద కాలం నుంచే వేసుకుంది. మనం ‘అనంత వాద్’ అనే తత్వాన్ని అనుసరించాము” అని తెలిపారు. సంప్రదాయాల కారణంగా ప్రజలు మోదీకి మూడోసారి అవకాశం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.