భారత్, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదానికి చెక్ పడినట్లే అనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం నెలకొంది. భారత్, చైనాల మధ్య ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ)కి అటు వైపు చైనా, ఇటు వైపు భారత్ పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించడంతో.. రెండు దేశాల సరిహద్దుల వద్ద ఉద్రిక్త పూర్వక వాతావరణం ఏర్పడింది. అయితే తాజాగా ఇరు దేశాలకు చెందిన సైనికాధికారులు చర్చలు జరపడంతో ఇకపై సమస్యలు శాంతియుతంగా పరిష్కారం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఎల్ఏసీ సరిహద్దు పొడవు 3488 కిలోమీటర్లు ఉంటుందని భారత్ భావిస్తుండగా, చైనా మాత్రం 2వేల కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని చెబుతోంది. ఇక సరిహద్దుకు అవతలి వైపు ఉన్న చైనా భారత్ వైపుకు దూసుకురావడంతో అప్రమత్తమైన అధికారులు సరిహద్దు వెంబడి భారీగా బలగాలను మోహరించారు. ఇది ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. అయితే భారత్‌కు చెందిన ఎక్స్ఐవీ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనాకు చెందిన మజ్ జనరల్ లియు లిన్‌లు చైనా సరిహద్దులోని మోల్డో వద్ద ఉన్న చుషుల్ లో సమావేశమై పూర్తిగా శాంతియుత వాతావరణంలో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకుందామని, ఇరు దేశాల మధ్య ఉప్ప శాంతి ఒప్పందాల ఆధారంగానే సమస్యలను పరిష్కారం చేసుకుందామని.. ఇరువురూ అంగీకారానికి వచ్చారు.
ఇక సమావేశం సందర్భంగా.. భారత సరిహద్దులోకి వచ్చిన చైనా బలగాలను వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని కూడా భారత్ కోరింది. దీనిపై చైనా నిర్ణయం తీసుకోనుంది. అయితే ఇరు దేశాల మధ్య పూర్తిగా సహృద్భావమైన వాతావరణంలో చర్చలు జరిగాయని, దీంతో రెండు దేశాల సరిహద్దుల వద్ద త్వరలోనే శాంతియుత వాతావరణం నెలకొంటుందని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.