భారత్- చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ కోసం ఇరుదేశాల సైనిక కమాండర్ల స్థాయిలో.. ఐదో రౌండ్ చర్చలు వచ్చేవారం జరగనున్నాయి. తూర్పు లద్దాఖ్ నుంచి బలగాలను వెనక్కి తరలించే లక్ష్యంతో రెండు దేశాల కమాండర్ల మధ్య ఇప్పటికే నాలుగు సార్లు చర్చలు జరిగాయి. అయితే పెట్రోలింగ్ పాయింట్ 14, 15, 17ఏ వద్ద నుంచి పూర్తిస్థాయిలో సైనిక ఉపసంహరణ జరగలేదు. ఈసారి అదే లక్ష్యంతో చర్చలు నిర్వహించనున్నట్లు తెలిపారు సైనిక అధికారులు.
పాంగాంగ్ సరస్సు వద్దనున్న 5, 8వ ఫింగర్ పాయింట్ల వద్ద నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లట్లేదు. ఈ నేపథ్యంలో వచ్చేవారం జరనున్న చర్చల్లో ఆయా ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని భారత్ పట్టుపట్టే అవకాశం ఉంది.శుక్రవారం ఇరుదేశాల దౌత్యాధికారుల మధ్య చర్చ జరిగింది. ఇందులో వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించిన బలగాలను వెనక్కి తీసుకోవాలని నొక్కి చెప్పింది భారత్. దౌత్య సంబంధాల పునరుద్ధరణకు చైనా తన సైన్యాన్ని వెనక్కి తరలించాల్సిందేనని వెల్లడించింది.