లాక్‌డౌన్ ఆరంభించిన తొలినాళ్లలో మన దేశంలో కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్నాయని సంబుర పడ్డాం. మే ఆఖరు వరకు కరోనా కేసులు చాలా వరకు తగ్గుతాయని సర్వేలు చేసి చెప్పిన పెద్ద మనుషుల మాటలు విని సంతోష పడ్డాం. కట్ చేస్తే.. సీన్స్ రివర్స్ అయింది. కరోనా కేసుల సంఖ్యలో మనం ఇప్పుడు చైనాను మించిపోయాం. మే ఆఖరు దగ్గర పడుతోంది. అయినా కరోనా అప్పటి వరకు తగ్గుముఖం పట్టే ఛాయలు అసలు ఇప్పుడు ఏ మాత్రం కనిపించడం లేదు.. సో.. ఇప్పుడు చేయాల్సింది ఏమిటి..? నెక్ట్స్ పరిణామాలు ఏమిటి..?
దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. లాక్‌డౌన్ మొదలుకాక ముందే ఎక్కడి వాళ్లను అక్కడికి పంపించి ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ చిక్కుకుపోయినవారందరూ తమ సొంత ఊళ్లకు వెళ్తున్నారు. ఇది ప్రమాదకరంగా పరిణమించింది. దీనికి తోడు సడలించిన ఆంక్షల వల్ల క్రమ శిక్షణ లేకుండా పోయింది. అదే కొంప ముంచుతోంది. ఫలితం.. సెకండ్ వేవ్ రూపంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ తొలి రెండు దశల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నా.. మరీ ఈ స్థాయిలో లేవు. కానీ ఇప్పుడు పెరుగుతున్న కరోనా కేసులే నిజానికి ప్రజలను భయ పెడుతున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థ కోసం ఆంక్షలను సడలించాయి బాగానే ఉంది. కానీ దాని వల్ల కరోనా విజృంభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను కంటెయిన్‌మెంట్ జోన్ల కింద విభజించి కట్టడి చేస్తుండడం కొంత వరకు వైరస్ వ్యాపించకుండా చూస్తోంది. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను మరింత నియంత్రించేలా కట్టుదిట్టమైన చర్యలను కచ్చితంగా తీసుకోవాలి. లేదంటే భారత్‌లో ఇంకా కొన్ని నెలల వరకు ఇలాగే పరిస్థితి ఉండే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా కరోనా కట్టడికి మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.