భారతదేశం మరోసారి పాకిస్తాన్ అసలైన రూపాన్ని అంతర్జాతీయంగా బహిర్గతం చేసింది. భారత విదేశాంగ శాఖ మరియు రక్షణ శాఖ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో పాకిస్తాన్ ఉగ్రవాద అనుసంధానాలపై కీలక అంశాలను ప్రస్తావించారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” ద్వారా పాకిస్తాన్‌లోని అనేక ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. ఇక గత బుధవారం రాత్రి పాకిస్తాన్, భారత నగరాలపై క్షిపణి దాడికి యత్నించినట్టు వెల్లడించారు. అయితే భారత గగనతల రక్షణ వ్యవస్థ ఆ దాడులను సమర్థంగా తిప్పికొట్టిందని వివరించారు. ప్రతిదాడిగా భారత్, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని కొంత మేరకు దెబ్బతీసిందని కూడా తెలిపారు.
ఇంతవరకు తమ దేశంలో ఉగ్రవాదం లేదని చెప్పుకొస్తున్న పాకిస్తాన్ ముక్కుచెదిరే స్థితిలో పడిపోయింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ మిస్రీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆపరేషన్ సిందూర్‌లో మృతి చెందిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ఇది తమ ప్రభుత్వం ఉగ్రవాదానికి ఏ స్థాయిలో మద్దతు ఇస్తుందనేదానికి స్పష్టమైన ఉదాహరణ అని ఆయన అన్నారు. ఈ అంత్యక్రియల సందర్భంగా పాక్ సైనికులు, పోలీసుల యూనిఫాంలో ఉండటం, శవయాత్రలో పాల్గొనడం, వారి కపాడుల ముందు సెల్యూట్ చేయడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలను భారత్ అంతర్జాతీయ వేదికల ముందు ఉంచి పాక్ యొక్క ద్వంద్వ వైఖరిని ప్రపంచానికి చూపించింది.