ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రానికి కీలకమైన అనేక నిర్ణయాలు తీసుకున్నారు. జమ్మూకశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత త్రివిధ దళాలు నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడాన్ని రాష్ట్ర కేబినెట్ ప్రశంసిస్తూ తీర్మానం చేసింది. ఈ దాడికి పాల్పడిన జవాన్లకు కేబినెట్ ప్రత్యేక అభినందనలు తెలిపింది. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీకి కేబినెట్ ధన్యవాదాలు తెలిపింది. రాజధాని అభివృద్ధి సంబంధిత 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని పరిధిలోని వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, అమరావతిని ఏపీ రాజధానిగా చట్టబద్ధం చేయాలన్న ప్రతిపాదనలకు అనుమతిచ్చింది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు సిద్ధమైంది.
సీటింగ్ అరేంజ్‌మెంట్ పై ప్రోటోకాల్ లో పొరపాట్లు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రధాని మోడీ పర్యటన సమయంలో రాష్ట్ర మంత్రులకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సముచిత స్థానం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఇతర కీలక నిర్ణయాల్లో భాగంగా, జలవనరుల శాఖలో “జల హారతి కార్పొరేషన్” ఏర్పాటు, చెరువుల్లో తవ్విన మట్టిని రైతులు తమ పొలాలకు ఉచితంగా తరలించుకునేందుకు అనుమతి, టీటీడీలో అర్బన్ డిజైన్ ప్లానింగ్ సెల్ ఏర్పాటు, టూరిజం ప్రాజెక్టుల్లో ఉద్యోగ ప్రోత్సాహాలు వంటి అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.