ప్రపంచంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికి ఇండియాలో మాత్రం అలాంటి పరిస్థితులు లేవని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం తెలిపారు. సిమ్లాలో విలేకరుల సమావేశంలో జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గ్లోబల్‌గా కొనసాగుతున్న వివాదాలు అంత త్వరగా ముగిసే అవకాశం లేవని తెలిపారు. ఈ విషయంలో నిలకడగా ఉండటానికి భారత్‌లో స్థిరమైన ప్రభుత్వం, శక్తివంతమైన నాయకుడు అవసరమని ఆయన పునరుద్ఘాటించారు.
రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-గాజా-ఇరాన్‌లలో వివాదాలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఇండియా సరిహద్దుల్లో కూడా సమస్యలు ఉన్నాయి, వాటిని ఎదుర్కొడానికి భారత్‌కు బలమైన నాయకత్వం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత సరిహద్దుల్లో కూడా ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నందున ఓటర్లందరూ కూడా తెలివిగా తమ నాయకుడిని ఎన్నుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీని ఉదహరిస్తూ మంత్రి ఎస్ జైశంకర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.