భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఈ మేరకు తాము మధ్యవర్తిత్వం వహించామని ఆయన ప్రకటించారు. “భారత్-పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించాం. రాత్రంతా భారత్-పాకిస్తాన్‌లతో చర్చలు జరిగాయి. రెండు దేశాలకు నా అభినందనలు. తక్షణమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి” అని ట్రంప్ వెల్లడించారు. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని పలువురు కోరారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ట్రంప్ ప్రకటన ప్రకారం, అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం ఎప్పుడు అమల్లోకి వస్తుంది, ఏ షరతుల మేరకు ఈ ఒప్పందం కుదిరింది అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడి ప్రకటనపై భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాలు ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ ప్రకటనతో సరిహద్దుల్లో శాంతి నెలకొంటుందని, ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయని అంతర్జాతీయ సమాజం ఆశిస్తోంది.