కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ.. ఆ 5 రాష్ట్రాలే ముందున్నాయి..

-

కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్‌డౌన్‌ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోయింది. గతంలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి జీడీపీ చేరుకుంది. అయితే ప్రస్తుతం ఆంక్షలను సడలిస్తుండడంతో దేశంలో మళ్లీ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది. అందులో భాగంగానే లాక్‌డౌన్‌ వల్ల ఏర్పడిన నష్టాన్ని మళ్లీ భర్తీ చేసుకునేందుకు రాష్ట్రాలు శ్రమిస్తున్నాయి. ఇక దేశంలోని ఆ 5 రాష్ట్రాలు మాత్రం భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ కోలుకునేందుకు దేశాన్ని ముందుండి నడిపిస్తున్నాయి.

దేశ జీడీపీలో 27 శాతం వాటా కలిగి ఉన్న కేరళ, పంజాబ్‌, తమిళనాడు, హర్యానా, కర్ణాటక రాష్ట్రాలు ప్రస్తుతం లాక్‌డౌన్‌ వల్ల దేశానికి కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు చాలా వరకు తోడ్పాటునందిస్తున్నాయి. ఈ 5 రాష్ట్రాలు ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ కోలుకునేలా చేస్తున్నాయని.. ముంబైకి చెందిన ఎలారా సెక్యూరిటీస్‌ ఐఎన్‌సీ అనే సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. ఈ మేరకు ఆ సంస్థకు చెందిన ఎకానమిస్ట్‌ గరిమా కపూర్‌ వివరాలను వెల్లడించారు.

ఆ 5 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఇతర రాష్ట్రాల కన్నా కార్యకలాపాలు మరింత మెరుగ్గా కొనసాగుతున్నాయని గరిమా కపూర్‌ తెలిపారు. విద్యుత్‌ వాడకం, ట్రాఫిక్‌ కదలికలు, హోల్‌సేల్‌ మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా, గూగుల్‌ మొబిలిటీ డేటా తదితర అంశాల ఆధారంగా ఆ 5 రాష్ట్రాలు ప్రస్తుతం ఇతర రాష్ట్రాల కన్నా అన్ని కార్యకలాపాలను కొంత మెరుగ్గా కొనసాగిస్తున్నాయని తెలిపారు. దీని వల్ల ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకుంటుందన్నారు.

అయితే మహారాష్ట్ర, గుజరాత్‌లలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడ ప్రస్తుతం అధిక సంఖ్యలో నమోదవుతున్న కోవిడ్‌ 19 కేసుల కారణంగా ఆయా రాష్ట్రాలు మళ్లీ కార్యకలాపాలను కొనసాగించడంలో వెనుకబడ్డాయన్నారు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో కొంత వరకు కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమైనా.. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే.. అందుకు చాలా సమయం పడుతుందన్నారు. ఇక ప్రస్తుతం ప్రజలు సెలూన్‌ సర్వీసులు, ఎయిర్‌ కండిషనర్లు, ఎయిర్‌ ట్రావెల్‌, బైక్‌లు, వాక్యూమ్‌ క్లీనర్లు, వాషింగ్‌ మెషిన్లు తదితర వస్తు సేవల కోసం ఎక్కువగా వెదుకుతున్నారని, అలాగే ఇయర్‌ఫోన్లు, హెయిర్‌ ఆయిల్‌, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లు, జ్యువెల్లరీ, మాప్స్‌, బొమ్మలు, మైక్రోవేవ్‌ ఓవెన్లను ప్రస్తుతం ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని ఆమె తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version