ప్రస్తుతం ఏపీ పరిణామాలపై కేంద్రంలోని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని భావిస్తోందా ? దీనికి రాష్ట్రానికే చెందిన పవన్ సారథ్యంలోని జనసేన కూడా చేతులు కలిపిందా ? అంటే.. తాజా పరిణామాలను గమనిస్తున్నవారు అవుననే అంటున్నారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో ప్రభుత్వం వీక్‌గా ఉంటే.. అక్కడ ఆపరేషన్ కమల్ పేరుతో బీజేపీ నాయకులు అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కర్ణాటకలో ఇలా కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చి.. యడియూరప్ప సర్కారును పీఠంపై కూర్చోబెట్టారు. తమిళనాడులోనూ తమకు నచ్చిన నాయకులను అధికారంలోకి తెచ్చుకున్నారు బీజేపీ నేతలు.
ఇక, ప్రస్తుతం మహారాష్ట్రలోనూ తమ మిత్రుడే అయినప్పటికీ.. కాంగ్రెస్-ఎన్సీపీతో జట్టుకట్టి అధికారంలోకి వచ్చాడనే అక్కసుతో .. ఉద్దవ్ ఠాక్రేను తనవైపు తిప్పుకొని కాంగ్రెస్-ఎన్సీపీలను వెళ్లగొట్టి.. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. మధ్య ప్రదేశ్‌లోనూ ప్రజాస్వామ్య బద్ధంగా నెగ్గిన కాంగ్రెస్‌లో చిచ్చు రేపి.. మళ్లీ శివరాజ్‌సింగ్ చవాన్‌ను అధికారంలోకి తెచ్చారు. ఇలా.. ఎక్కడ ప్రభుత్వాలు వీక్‌గా ఉంటే.. అక్కడ బీజేపీ ఆపరేషన్ కమల్‌ను ప్రయోగిస్తోంది. అయితే, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో మాత్రం సుస్థిరమైన వైసీపీ ప్రభుత్వం ఉంది.
దీనిని కదపడం కానీ, కూల్చడం కానీ ఎవరివల్లా కాదు. 151 మంది ఎమ్మెల్యేల.. అత్యంత భారీ మెజారిటీతో.. కనీవినీ ఎరుగని ప్రజాబలంతో అధికారంలోకి వచ్చారు జగన్. అయినప్పటికీ ఇక్కడ కూడా విస్తరించాలనేది బీజేపీ వ్యూహం. ఈ క్రమంలోనే జగన్ ఎక్కడ ప్రజల మనసుల్లో పాగా వేసుకుంటారో.. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే ఎక్కడ గెలుస్తారో.. అనే కుటిల ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే.. ప్రజల్లోనూ, మేథావుల్లోనూ జగన్‌పై వ్యతిరేక ఆలోచన వచ్చేలా వ్యూహాత్మకంగా వ్యవహరించి.. ఆయన తీసుకునే నిర్ణయాలను తప్పు పట్టించేలా చేస్తున్నారనేది జాతీయ మీడియా తాజాగా వెల్లడించిన కథనాలను బట్టి తెలుస్తోంది.
దీనికి రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం సహా జనసేన కూడా ఉందని అంటున్నారు. మొత్తంగా జగన్‌ను ప్రజలతోనే వ్యతిరేకించేలా చేస్తున్నారని అంటున్నారు. ఇదే విషయాన్ని జాతీయ మీడియా కూడా వెల్లడించింది. తద్వారా వైసీపీ స్థానాన్ని బీజేపీ భర్తీ చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. జగన్ ఈ వలకు చిక్కుతారా లేదా చూడాలి.