దేశ ప్రధాని మోదీ కరోనా లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. అందులో భాగంగానే ఆయన కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేస్తుందని ప్రకటించారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం కేంద్ర హోం శాఖ పలు మార్గదర్శకాలను ప్రకటించింది. అయితే తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మరొక ప్రకటన విడుదల చేసింది. దేశంలో ఉన్న జిల్లాలను కరోనా ప్రభావం ఉన్న మేర హాట్‌స్పాట్‌లు, గ్రీన్‌జోన్లుగా విభజించినట్లు తెలిపింది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలోని అన్ని జిల్లాలను 3 భాగాలుగా విభజిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్ ప్రభావం ఉన్న హాట్‌స్పాట్ జిల్లాలు, హాట్‌స్పాట్ యేతర (నాన్ హాట్‌స్పాట్) జిల్లాలు, గ్రీన్ జోన్ జిల్లాలను విభజించినట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
దేశంలోని జిల్లాల్లో ఇప్పటి వరకు వైరస్ ప్రభావం ఉన్న జిల్లాల్లో 170 జిల్లాలను హాట్‌స్పాట్‌లుగా ప్రకటించగా, మరో 207 జిల్లాలను నాన్ హాట్‌స్పాట్ జిల్లాలుగా ప్రకటించారు. ఇక మిగిలిన జిల్లాల వివరాలను కేంద్రం వెల్లడించాల్సి ఉంది.