కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడి ఇప్పటికే ఆయా రంగాలకు తీవ్రమైన నష్టం కలుగుతున్న విషయం విదితమే. అయితే ఇప్పుడు ఆ ప్రభావం దినపత్రికలపై కూడా పడుతుందా..? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే.. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా వరకు ప్రాంతాల్లో న్యూస్ పేపర్లను జనాలు తీసుకోవడం లేదట. పేపర్ బాయ్‌లు న్యూస్ పేపర్లు వేసినా వాటిని జనాలు తీసుకోవడం లేదని తెలిసింది. కరోనా వైరస్ న్యూస్ పేపర్ల ద్వారా ఎక్కడ తమకు వ్యాప్తి చెందుతుందోనని జనాలు భయపడుతున్నారని, అందుకనే చాలా మంది దినపత్రికలను తీసుకోవడం లేదని తెలుస్తోంది.
న్యూస్ పేపర్లను జనాలు చాలా ప్రాంతాల్లో తీసుకోకపోతుండడంతో పేపర్ బాయ్‌లు వాటిని ఏజెన్సీల ద్వారా వెనక్కు పంపించేస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలో పత్రికలు ఇప్పుడు ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలా..? అని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు దాదాపుగా అన్ని పత్రికలు తీవ్ర నష్టాల్లో ఉండడంతో కొద్ది రోజుల పాటు పత్రికలను మూసివేయడమే ఉత్తమమని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మార్చి 31వ తేదీ వరకు పత్రికలను కూడా బంద్ చేస్తారని తెలుస్తోంది.
అయితే అన్ని రోజుల పాటు పత్రికలు మూసివేస్తే పరిస్థితి ఏమవుతుంది..? తిరిగి పత్రికలను ప్రజలకు వేయగలమా..? అని కూడా ఆయా సంస్థలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. పత్రికలను వేసేందుకు ఏజెంట్లకు, హాకర్లకు అంత కమిషన్లు కూడా ప్రస్తుతం ఇవ్వడం లేదు. ఈ క్రమంలో పత్రికలను మూసేస్తే వారు మళ్లీ పత్రికలను ఓపెన్ చేసినా.. తిరిగి పని చేస్తారా..? అన్న సందేహం పత్రికల యాజమాన్యాలలో నెలకొందని.. అందుకనే పత్రికలను కంటిన్యూ చేయాలా.. లేదా కరోనా కారణంగా కొన్ని రోజుల పాటు ఆపేయాలా.. అన్న సందిగ్ధావస్థలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై ఆయా పత్రికల యాజమాన్యాలు ఏం ఆలోచిస్తాయన్నది త్వరలో తెలుస్తుంది..!