బెజవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా పండుగ నేపథ్యంలో శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. అక్టోబర్ 3వ తేదీన నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మరల 12వ తేదీ విజయదశమి పండుగతో వేడుకలు ముగియనున్నాయి.దసరా నవరాత్రుల్లో అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు అలంకార సేవలు నిరంతరాయంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు.
అక్టోబర్ 3న అమ్మవారిని బాలాత్రిపుర సుందరీ దేవిగా అలంకరించనున్నారు. ఆ తర్వాత 4న గాయత్రీ దేవిగా, 5న అన్నపూర్ణా దేవిగా , 6న లలితా త్రిపుర సుందరీ దేవిగా, 7న మహా చండీ దేవిగా, 8న మహాలక్ష్మీ దేవిగా , 9న సరస్వతీ దేవిగా (మూల నక్షత్రం), 10న దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవిగా, 11న మహర్నవమి రోజున మహిషాసుర మర్దినిగా, 12వ తేదీ విజయదశమి సందర్భంగా ఉదయం మహిషాసుర మర్దినిగా,సాయంత్రం రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అలంకార సేవలు, ప్రత్యేక పూజల తర్వాత సాయంత్రం కృష్ణ నదిలో తెప్పోత్సవం జరుగనుంది.