విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఏపీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడితో పాటు అతనికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్లో ఓ ప్రేమోన్మాది ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాలిక మరణం తనను కలిచివేసిందన్నారు.
నిందితుడు విఘ్నేష్, అతనికి సహకరించిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామన్నారు. బాధితురాలి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ నిచ్చారు. కాగా, శనివారం విఘ్నేష్ తన స్నేహితురాలైన ఇంటర్ విద్యార్థిని కలవాలని పిలిచి ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి ఆమె మీద పెట్రోల్ పోసి నిప్పటించిన విషయం తెలిసిందే. అంతకుముందు పెళ్లి చేసుకోవాలని ఆమెను ఒత్తిడి చేయడంతో అందుకు ఆమె నిరాకరించినట్లు సమాచారం. కాగా, ఘటనలో బాధితురాలికి 80 శాతం గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ బాలిక తుదిశ్వాస విడిచింది. కాగా, నిందితుడికి ఇదివరకే వివాహం కాగా, అతని భార్య గర్భవతి అని తెలుస్తోంది.