ఏపీ సాఫీగా సాగుతున్న బీజేపీ,జనసేన పొత్తు తెలంగాణలో మాత్రం మిస్టరీగా మారింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన చివరి నిమిషంలో షాకివ్వడంతో తెలంగాణలో గ్యాప్ పాటిస్తున్నాయి ఈ రెండు పార్టీలు. ఇప్పుడు తాజాగా ఏపీలో తిరుపతి లోక్‌సభకు, తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీకి ఉపఎన్నికలు జరుగుతున్నాయి. తిరుపతిలో రెండు పార్టీలు కలిసి సాగుతున్నా.. సాగర్‌లో జనసేన నిర్ణయం పై తెలంగాణ బీజేపీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.
ఏపీలో కలిసి సాగుతున్న బీజేపీ, జనసేన పార్టీలు తెలంగాణలో మాత్రం ఎడమొఖం పెడమొఖంగా ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికల సమయంలో ఏర్పడిన ఈ దూరం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లైమాక్స్ కి చేరింది. చివరి నిమిషంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభివాణికి మద్దతు పలికారు జనసేనాని పవన్ కల్యాణ్. ఆ తర్వాత పవన్ చేసిన కామెంట్స్ కూడా రెండుపార్టీల్లో చర్చకు దారి తీశాయి. పవన్ నిర్ణయం బాధపెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించి ఊరుకున్నారు.
ఇప్పుడు సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో సయోధ్య దిశగా రెండు పార్టీల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పవన్ దగ్గరకు వెళ్లి చర్చించిన బీజేపీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అలాంటి చొరవ తీసుకోలేదు. ఎలాగూ ఓడిపోయాం అనుకున్నారో ఏమో..మళ్లీ పవన్ గడప తొక్కలేదు. ఇప్పుడు నాగార్జునసాగర్ ఉపఎన్నిక వేడి నెలకొంది. దుబ్బాక ఉపఎన్నిక సమయంలో పవన్ కల్యాణ్ వచ్చి ప్రచారం చేస్తారని అనుకున్నా.. జనసేనాని రాలేదు. సాగర్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్న సంశయం బీజేపీలో కనపడుతుంది.
సాగర్‌లో పోటీ చేస్తామని దాదాపు పది మంది ఆశావహులు పార్టీని కోరినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. 2018లో ఇక్కడ జనసేన పోటీ చేయలేదు. నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా వేముల సతీష్‌రెడ్డి బరిలో నిల్చుంటే ఆయనకు 1100 ఓట్లు వచ్చాయి. సాగర్‌లో జనసేన బలమెంతో తెలియదు. కానీ పవన్ అభిమానులు ఉన్నారన్నది ఆ పార్టీ చెప్పేమాట. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్న సమయంలో ఏ వర్గం ఓట్లను వదులుకునే స్థితిలో పార్టీలు లేవు. అందుకే జనసేన అభిమానుల ఓట్లు గురించి కూడా చర్చ జరుగుతోంది.
తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో సీఎం అభ్యర్ది అంటూ పవన్ ని ఆకాశానికి ఎత్తుతుంది ఏపీ బీజేపీ. తిరుపతిలో బీజేపీ తరుపున ప్రచారానికి జనసేనాని షెడ్యూల్ కూడా ఖరారైంది. దీంతో తెలంగాణలో కూడా అంతే సానుకూలంగా బీజేపీకి పవన్ మద్దతిస్తారని చర్చించుకుంటున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. రెండు చోట్ల రెండు స్టాండ్లు తీసుకుంటే పవన్ విశ్వసనియత దెబ్బతింటుందని అందుకే సాగర్ లో బీజేపీ అభ్యర్దికి జనసేనాని మద్దతిస్తారని తెలంగాణ బీజేపీ నేతలు లెక్కలేస్తున్నారు.