130 కోట్ల మంది జనాభాను పాలిస్తున్న ప్రధాని నరేంద్రమోడీకి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సలహా ఇచ్చారట! కరోనాను ఎలా కట్టడి చేయాలి? ప్రభుత్వాలు ఎలా పనిచేయాలి? ప్రజల ఆదరణ చూరగొనేందుకు, కరోనా నుంచి వారిని రక్షించేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి? అనే విషయాలపై చంద్రబాబు స్వయంగా మోడీకి సలహాలు ఇచ్చారట!! వాటిని పాటించి దేశాన్ని బాగు చేయాలని కూడా ఆయన సూచించారట! చిత్రం ఏంటంటే ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే ప్రకటించుకోవడం. మంగళవారం ఉదయం ప్రధాని మోదీ తనకు ఫోన్ చేసి కరోనా కట్టడిపై నిశితంగా మాట్లాడారని బాబు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనకు తాము చేసిన అధ్యయనాలను నేరుగా వివరించానన్నారు.
కరోనా కట్టడికి సమాజహితం కోసం ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టామని.. సాంకేతిక సాయం ద్వారా ప్రజలకు అందుబాటులో విజ్ఞానం ఉంచటమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. మేధావులు, నిపుణులు, వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నామన్నా రు. మా అధ్యయనాలపై ఇదివరకే ప్రధానికి లేఖ రాశామని.. జోన్ల వారీగా కరోనా వ్యాప్తి ప్రాంతాలను విభజించమని ఆ లేఖలో కోరానన్నారు. అయితే ఇవాళ ప్రధాని ఫోన్ చేసినప్పుడు కూడా తాము చేసిన అధ్యయనాలను వివరించినట్లు చంద్రబాబు తెలిపారు. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లు అమలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించాం. కేంద్రం కూడా దానిని పరిశీలిస్తోంది. ప్రభుత్వాలకు ఆర్థిక కష్టాలు ఉన్నాయని తెలుసు, ఈ సమయంలో రాజకీయం చేయట్లేదు. అని బాబు చెప్పుకొచ్చారు.
అన్ని రంగాలకు అనేక ఆర్థిక సమస్యలున్నాయి. సమష్టిగా పోరాడేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి. ఎలాంటి భేషజాలు, రాజకీయ లబ్ధి అసలే వద్దు. ఈ సమస్య ఒక పార్టీదో వ్యక్తిదో కాదని గ్రహించి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. పేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలి. కరోనా తర్వాత ప్రపంచంలో ఎలాంటి మార్పులు ఉంటాయో ఊహించటమే కష్టంగా ఉంది. ప్రభుత్వాలు-ప్రజలు ఒకరికొకకరు సహకరించుకుంటేనే కరోనా నివారణ సాధ్యం. కలసికట్టుగా విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని ఈ సందర్భంగా చంద్రబాబు పలు సూచనలు, సలహాలు చేశారు.
నిజానికి అనేక మంది సీనియర్ ఐఏఎస్‌లు ఐపీఎస్‌లు, ఐఎఫ్ ఎస్‌లు ప్రధాని మోడీకి అనేక రూపాల్లో సలహాలు ఇస్తున్నారు. అయినా బాబు ఇచ్చిన సలహాలను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలోనూ ఆ క్రెడిట్ తనదేనని, తన సూచనల వల్లే మోడీ పెద్ద నోట్లు రద్దు చేశారని పేర్కొనడం గమనార్హం. మొత్తానికి బాబు సెంటరాఫ్‌ది టాపిక్ అయ్యారు మరోసారి!