ఏమాటకామాటే చెప్పుకోవాలి. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు వ్యూహం అమరావతి విషయంలో ఎట్టకేలకు ఫలించింది. చంద్రబాబు తన పార్టీ వారిని పూర్తిస్థాయిలో రాజధాని ఉద్యమంలో భాగస్వామ్యం చేయలేక పోయినా.. రైతులను మాత్రం సెంటి మెంటుతో కదిలించారు. తాజాగా సోమవారం రాజధాని గ్రామాల్లో రైతులు కదం తొక్కారు. పార్టీలకు అతీతంగా రైతులు రావడం గమనార్హం. మూడు రాజధానుల ప్రకటన వచ్చిన తర్వాత చంద్రబాబు రెండు రోజుల వరకు పెద్దగా స్పందించలేదు. దీంతో అసలు టీడీపీలో ఏం జరుగుతోందనే విషయం ఆసక్తిగా మారింది. ఆ తర్వాత పుంజుకున్న ఆయన ఇక్కడ నాయకులను ఉత్సాహ పరి చి క్షేత్రస్థాయికి పంపారు.
దీంతో ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వంటివారు.. రాజధానిలో పర్యటించి రైతులకు అం డగా ఉంటామని వాగ్దానం చేశారు. అదేసమయంలో తమపై వచ్చిన ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఆరోపణల విషయంలోనూ వారు సూటిగానే స్పందించారు. రాజధాని గ్రామాలకు, నియోజకవర్గాలకు చెందిన వారిని కదిలించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అయితే, ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మలచాలని అనుకున్నప్పటికీ.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల టీడీపీ నాయకులు తలో విధంగా స్పందించారు. విశాఖలో రాజధానిని మాజీ మంత్రి గంటా ఆహ్వానించారు. మిగిలిన నాయకులు కూడా ఉమ్మడిగా భేటీ అయి… రాజధానిని విశాఖలో ఏర్పాటు చేస్తే.. తాము స్వాగతిస్తామంటూ.. తీర్మానం చేశారు.
అదేసమయంలో తమ నాయకుడు చంద్ర బాబు డిమాండ్ చేస్తున్నట్టుగా రాజధాని రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక, సీమ నాయకులు ఈవిషయంలో తటస్థంగా స్పందించారు. రాజధానిగా అమరావతినే కొనసాగిం చాలని విశాఖ తమకు దూరాభారం అవుతుంది కాబట్టి.. దీనిని తరలించరాదనే డిమాండ్ వినిపించారు. లేదా కర్నూలులో మరో రాజధానిని ఏర్పాటు చేయాలని వారు కోరారు. సరే! టీడీపీ నేతల భిన్న వాదనల నేపథ్యంలో చంద్రబాబు అందరినీ కలిపి ఏకతాటిపైకి తీసుకురావాలన్న వ్యూహం విఫలమైంది. దీంతో కొన్ని రోజులు మౌనంగా ఉన్నబాబు.. ఎట్టకేలకు తన సతీమణితో రంగంలోకి దిగిపోయారు.
రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే బాబు సతీమణి భువనేశ్వరి.. ఏకంగా తన చేతికి ఉన్న గాజులు తీసి ఉద్యమ నాయకులకు విరాళంగా ప్రకటించారు. దీంతో బాబు వ్యూహం కొంతమేరకు ఫలించింది. ఇక, నూతన సంవత్సరం పండుగను కూడా తాను జరుపుకోబోనని ప్రకటించి మరింతగా రైతులకు చేరువయ్యారు. ఇక, సోమవారం.. సంక్రాంతి ని కూడా తాను జరుపుకోబోనని, తనపైనా తన పార్టీ నాయకులపైనా ఆరోపణలు చేస్తున్న జగన్ ప్రభుత్వం వాటిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకుని తమను శిక్షించాలని, రైతులను రక్షించాలని చేసిన ప్రకటన నిజంగానే అందరినీ ఆకర్షించింది. దీంతో ఎక్కడికక్కడ పార్టీలకు అతీతంగా రైతులు ముందుకు వచ్చారు. బాబుకు అండగా నిలిచారు. ఫలితంగా నేతలను ఆయన కూడగట్టలేక పోయినా.. రైతుల మద్దతును సాధించడంలో బాబు సక్సెస్ అయ్యారనేవాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.