రాష్ట్రంలో ఒకవైపు కరోనా వైరస్ కుమ్మేస్తోంటే.. మరోవైపు రాజకీయంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీలోని యువ నేతలు మాత్రం కు మిలిపోతున్నారు. గత ఏడాది ఎన్నికల సమయంలో చాలా మంది యువ నాయకులు రంగంలోకి దిగారు. భారీ ఎత్తున ఖర్చు చేసి మరీ ఎన్నికల్లో వైసీపీపై తలపడ్డారు. రెండో సారి ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరి గిన నేపథ్యంలో యువ నేతలు భారీ ఎత్తున రంగంలోకి దిగారు. అయితే ఒకరు తప్ప మిగిలిన వారంతా కూడా ఓడిపోయారు. రాజమండ్రి సిటీ నుంచి భవానీ విజయం సాధించారు. మిగిలిన వారిలో యువ నాయకులు ఎక్కడా విజయం సాధించలేదు. దీంతో వారంతా కూడా ఇప్పుడు తమను పట్టించుకోవాలని పార్టీని కోరుతున్నారు.
అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు కూడా యువ నాయకులు చాలా మంది ఉన్నారు. వీరిలో తొలిసారి పోటీ చేసిన వారే టీడీపీలో ఎక్కువగా కనిపిస్తున్నారు. నిజానికి వీరిపైనే చంద్రబాబు ఆధారపడ్డారు కూడా. ఎందుకంటే.. ఒకవేళ రెండో సారి టీడీపీ కనుక అధికారంలోకి వచ్చి ఉంటే.. ఎలాగైనా సరే.. తన తనయుడిని సీఎం పీఠంపై కూర్చోబెట్టడమో.. లేక డిప్యూటీ సీఎంను చేయడమో చేయాలని ఆయన ప్లాన్ వేసుకున్నారు. కానీ, పార్టీలోని సీనియర్లు మాత్రం లోకేష్ వ్యవహారశైలిపై గుంభనంగా ఉన్నారు. గతంలో మంత్రులుగా చేసిన వారిలో చాలా మంది లోకేష్ నాయకత్వంపై విమర్శలు కూడా చేశారు. దీనికి కారణం.. వయసు పరంగాను, రాజకీయ పరంగాను కూడా వారికి, లోకేష్ కు మధ్య కొన్నేళ్ల వ్యత్యాసం ఉండడమే.
ఈ క్రమంలోనే చంద్రబాబు యువతను చేరదీశారు. వారికే టికెట్లు కూడా ఇచ్చారు. యువత అయితే, లోకేష్ నాయకత్వానికి ఢోకా ఉండదని భావించారు. వారు తప్పకుండా లోకేష్‌కు అండగా నిలుస్తారని, తాను రేపు పార్టీ పగ్గాలను పూర్తిగా లోకేష్‌కు అప్పగించినా.. చింత తీరుతుందని అనుకున్నారు. అయితే, పార్టీ అధికారంలోకి రాకపోగా.. అటు లోకేష్ సహా ఇటు యువ నేతలు అందరూ మూకుమ్మడిగా పరాజయం పాలయ్యారు. తర్వాత కూడా లోకేష్ నాకత్వానికి జైకొట్టించేందుకు యువ నేతలకు పార్టీ పేరుతో రెండు సార్లు హైదరాబాద్ పిలిపించి వారికి పార్టీలో 33 శాతం ప్రాధాన్యం పదవులు ఇస్తామనిచెప్పారు. కానీ, ఇప్పటి వరకు ఇది కార్యాచరణకు నోచుకోలేదు.
మరోపక్క, యువనేతలకు ఎక్కడికక్కడ సమస్యలు ఏర్పడుతున్నాయి. కొందరు దూకుడుగా ఉన్నా.. పార్టీ పదవులు ఇప్పటి వరకు దక్కలేదు. మరికొందరు ఇంచార్జ్‌లుగా ఉన్నప్పటికీ.. నియోజకవర్గాల మార్పును కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు. అరకు, రాజాం, ధర్మవరం వంటి నియోజకవర్గాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇక్కడ వీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పార్టీ అధిష్టానం పరిష్కారం చూపించడం లేదు. రాజాం నియోజకవర్గం బాధ్యతలను తనకు అప్పగించాలని ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ కోరుతున్నారు.
అయినా పార్టీ స్పందించలేదు. అరకులో తనకు అనుకూల పరిస్థితులు లేవని అక్కడ నుంచి పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి కిడారి శ్రవణ్ చెబుతున్నారు. అయినా ఇప్పటి వరకు ఆ సమస్యలు ఏంటో అధిష్టానం దృష్టి పెట్టలేదు. దీంతో యువ నేతలు తల్లడిల్లుతున్నారు. దీనినే సీనియర్లు కూడా ప్రస్తావిస్తున్నారు. ఎలాగూ సీనియర్లు తప్పుకోవాలని భావిస్తున్నందున జూనియర్లను గాడిలో పెట్టాలని వారు కూడా కోరుతున్నారు.