ఏపీ అధికార పార్టీ వైసీపీలో మునుపెన్నడూ లేని నిస్తేజం అలుముకుందా? పార్టీకి-ప్రబుత్వానికి మధ్య గ్యాప్ పెరుగుతోందా? పార్టీకి దశ-దిశ లేకపోవడంతో నాయకులు ఎవరికి వారే మిన్నకుంటున్నారా? అంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారు ఔననే అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకుం టాయని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా గత ఏడాది ఎన్నికలు జోరుగా సాగాయి. హోరా హోరీగా సాగిన ఎన్నికల్లో నాయకులు భారీగానే ఖర్చు పెట్టారు. దీనికి సంబంధించి కొందరు ఎన్నారైల నుంచి ఫండ్ వసూలు చేసుకుంటే.. మరికొందరు సొంత నిధులు ఖర్చు పెట్టారు.
అంతేకాదు,చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్న నాయకులు కూడా కనిపిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ తీసుకువచ్చిన అనేక నిబంధనలు, పారదర్శకత వంటివి కూడా ఎమ్మెల్యేలకు చేతులు కట్టేసినట్టు అయిపో యిందనే భావన కలుగుతోంది. ఏదైనా సరే ప్రభుత్వం నుంచి నేరుగా వస్తేనే.. లేదంటే లేదనే పరిస్థితి ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఏర్పడింది. ఈ పరిణామాలతో వారు ఇప్పుడు అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు.
మన ప్రభుత్వం వచ్చినా ఏముంది అన్నా.. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక బంగారు అమ్మేసుకున్నాం.. అని గుంటూరుకు చెందిన ఓ మహిళా నాయకురాలు ఆవేదన వ్యక్తం చేసిన తీరు ఇప్పుడు వైసీపీలో హల్చల్ చేస్తోంది. దీంతో ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా నిరాశ, నిస్తేజంలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. మరి ఈ విషయంలో పార్టీ అధినేత, సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. నేతల్లో ఉత్సాహం ఎలా నింపుతారో.. చూడాలి.