ఈ ఏడాది హజ్ యాత్రలో భారీ సంఖ్యలో యాత్రికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఏడాది 1,300 మందికి పైగా మృతి చెందినట్లు సౌదీ అధికారిక వర్గాలు ప్రకటించాయి. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాలులే అందుకు కారణమమని తెలిపాయి. మృతుల్లో 83 శాతం మంది చట్టవిరుద్ధంగా వచ్చినవారేనని వెల్లడించాయి.
ఎలాంటి పత్రాలు లేకపోవడం వల్ల మృతులను గుర్తించడం సంక్లిష్టంగా మారినట్లు సౌదీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహద్‌బిన్ అబ్దుర్రహ్మాన్ అల్-జలజెల్ తెలిపారు. కొంతమందికి ఇప్పటికే మక్కాలో సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది హజ్ సమయంలో సౌదీలో ఉష్ణోగ్రతలు 46 నుంచి 49 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.
మృతుల్లో 660 మందికి పైగా ఈజిప్టు వాసులు ఉన్నారని ఆ దేశ అధికారిక వర్గాలు తెలిపాయి. 31 మంది మినహా మిగతావారంతా అక్రమంగా హజ్ యాత్రకు వెళ్లినవారేనని వెల్లడించాయి. వీరిని తీసుకెళ్లిన 16 ట్రావెల్ ఏజెన్సీల లైసెన్సులను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. మృతుల్లో 165 మంది ఇండోనేషియా, 98 మంది భారతీయులు, పదుల సంఖ్యలో జోర్డాన్, టునీషియా, మొరాకో, అల్జీరియా, మలేషియా సహా ఇతర దేశాల నుంచి ఉన్నారని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ ‘అసోసియేటెడ్ ప్రెస్’ వెల్లడించింది.