రష్యాలోని డాగేస్థాన్‌లో సాయుధులైన మిలిటెంట్లు దారుణానికి పాల్పడ్డారు. రెండు చర్చిలు, ఓ యూదుల ప్రార్థనామందిరం, పోలీసుల పోస్టుపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఈ ఘటనలో 15 మంది పోలీసులు సహా పలువురు సామాన్య పౌరులు దుర్మరణం చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డట్లు డాగేస్థాన్ గవర్నర్ సెర్గీ మెలికోవ్ సోమవారం వెల్లడించారు.
మఖచ్‌కల, డెర్బెంట్ నగరాల్లోని చర్చిలు, ప్రార్థనామందిరాలను మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకోగా.. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌ను చేపట్టాయి. ఆరుగురు సాయుధులను చంపాయి. ప్రస్తుతానికి ఆపరేషన్ ముగిసినట్లు రష్యా ‘జాతీయ ఉగ్రవాద నిరోధక కమిటీ (NAC)’ ప్రకటించింది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయని వెల్లడించింది. ఘటన జరిగిన ప్రాంతాలు పూర్తిగా భద్రతా బలగాల అధీనంలో ఉన్నట్లు తెలిపింది. డాగేస్థాన్‌లో జూన్ 24, 25, 26 సంతాప దినాలుగా స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. దాడికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.