నైజీరియాలో జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల్లో దాదాపుగా 18 మంది దుర్మరణఁ పాలయ్యారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మహిళా ఆత్మాహుతి బాంబర్లు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు సహా ఓ గర్భవతి కూడా ఉన్నట్లు సమాచారం.
స్థానిక ప్రభుత్వ ఎమర్జెన్సీ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని బోర్నో రాష్ట్రం గ్వోజా పట్టణంలో శనివారం ఈ దాడులు జరిగాయి. చిన్నారిని ఎత్తుకున్న ఓ మహిళ గ్వోజా పట్టణంలో శనివారం జరిగిన వివాహ కార్యక్రమంలో తనని తాను పేల్చుకున్నట్లు ఏఎఫ్‌పీ కథనాన్ని ప్రచురించింది. అదే పట్టణంలో మరో మహిళ ఆసుపత్రిలో ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు.. వీటి నుంచి తేరుకోక ముందే వివాహ కార్యక్రమంలో మరణించిన వారికి నిర్వహిస్తున్న అంత్యక్రియల్లో మరో మహిళ తన శరీరానికి అమర్చుకున్న ఐఈడీని పేల్చుకున్నట్లు ఈ కథనంలో పేర్కొంది.