టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ ఇండియా ఆటగాళ్లు మ్యాచ్ అనంతరం సంబురాలు చేసుకున్నారు. స్టేడియంలో పరిగెత్తుతూ జాతీయ జెండాను పట్టుకుని నినాదాలు చేస్తూ అంబరాన్నంటేలా సంబురాలు చేసుకున్నారు. ఇక మ్యాచ్ అనంతరం టీమ్ సభ్యుతో కలసి విరాట్ కోహ్లీ చిందేశాడు. ముఖ్యంగా అక్షర్ పటేల్, విరాట్ చేసిన బాంగ్రా డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది.
మరోవైపు ట్రోఫీతో మైదానంలో తిరుగుతూ టీమ్ ఇండియా అభిమానులకు అభివాదం చేసింది. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ తన కుమార్తెను భుజాలపై ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్లడం అందరినీ ఆకర్షించింది.
ఇక ఈ టోర్నీలో టీమ్‌ఇండియా ఆపద్బాంధవుడిగా నిలిచిన జస్‌ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్ సత్తా చాటాడు. తుదిపోరులో ఓటమి దిశగా సాగుతున్న జట్టును 18 ఓవర్లో రెండు పరుగులే ఇచ్చి, ఓ వికెట్ తీసి బుమ్రా గెలుపు వైపు మళ్లించాడు. ట్రోఫీని కైవసం చేసుకున్న అనంతరం బుమ్రా తన కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకున్నాడు. ఇక టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం జట్టు సభ్యులతో కలసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఎప్పుడూ ఎంతో సైలెంట్‌గా కనిపించే ద్రవిడ్ సైతం అల్లరి పిల్లాడిలా మారి టీమ్‌తో కలిసి సంబురాలు చేసుకున్నాడు.