ప్రపంచవ్యాప్తంగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. అగ్నిగోళంలా మండుతున్న సూర్యుడి తాపానికి ప్రజలు విలవిలలాడుతున్నారు. ఓవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరోవైపు వడగాలులతో జనం పిట్టల్లా రాలుతున్నారు. అయితే విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తోందని ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ తెలిపింది. ఈ పరిస్థితిపై సదరు సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
‘ముందస్తు రుతుపవనాల జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు లేకపోవడంతో ఏప్రిల్ నెలలో భారత దక్షిణ ద్వీపకల్పంలో 1901 తరువాత ఐదో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో 2023 జూన్ నుంచి 10 నెలలుగా ప్రతినెలా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 11వ మాసం (ఏప్రిల్) అత్యంత వేడి నెలగా రికార్డులకు ఎక్కింది. భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు జరుగుతున్న ఓటింగ్, అభ్యర్థుల ప్రచారంపై వాతావరణ మార్పుల ప్రభావం ఉంది’ అని.. ‘‘దేశంలో మరోసారి వేసవిలో ఎన్నికలు నిర్వహించేందుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు అనుకూలిస్తాయా?’’ అనే అంశం పేరిట నివేదిక విడుదల చేసింది.