నేపాల్‌లో ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో నారాయణఘాట్-ముగ్‌లింగ్ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగి పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆ మార్గంలో దాదాపు 65 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులపై కొండచరియలు పడడంతో పక్కనే ఉన్న త్రిశూన్ నదిలో పడ్డాయి. ఈ ఘటనలో గల్లంతైన వారిలో ఏడుగురు భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలొస్తున్నాయి.
24 మంది ప్రయాణికులతో ఓ బస్సు కాఠ్‌మాండూ వెళుతోంది. మరో బస్సులో 41 మంది ఉన్నారు. వీటిని గణపతి డీలక్స్, ఏంజెల్ బస్సులుగా గుర్తించారు. వీటిల్లో గణపతి డీలక్స్‌కు చెందినదిగా భావిస్తున్న బస్సు నుంచి ముగ్గురు ప్రయాణికులు తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. బస్సు ప్రమాదానికి గురికాగానే వారు దానిలోనుంచి బయటకు దూకేసినట్లు వెల్లడించారు. అదే మార్గంలో మరోచోట కూడా బస్సుపై కొండచరియ విరిగిపడటంతో దాని డ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఈ బస్సు బుట్వాల్ నుంచి కాఠ్‌మాండూకు వెళుతోంది. ఈ ఘటనపై నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ విచారం వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఏజెన్సీలు అక్కడ బాధితుల గాలింపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.