ఐరోపాకు బయలుదేరిన ఓ పడవ లిబియా తీరం వద్ద సముద్రంలో బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 60 మందికి పైగా మరణించినట్లు సమాచారం. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ఐరాసకు చెందిన ‘ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్’ వెల్లడించింది. లిబియా పశ్చిమ తీరంలోని జువారా పట్టణం తీరంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపింది. ఆ తీరంలో వచ్చిన బలమైన అలల తాకిడికి పడవ కొట్టుకుపోయినట్లు ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలిపారు.
యుద్ధాలు, పేదరికం నేపథ్యంలో పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల నుంచి ఏటా ఐరోపాకు వలసపోతున్న వేలాది మందికి లిబియా ప్రధాన రవాణా కేంద్రంగా మారింది. మెరుగైన జీవితాన్ని ఆశిస్తూ చాలా మంది ఆఫ్రికా దేశాల నుంచి ఐరోపా దేశాలకు వలస వెళ్లే క్రమంలో చాలా మంది ఈ మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో అలల తాకిడి, ఇతర కారణాల వల్ల చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో వందల కొద్ది వలస కార్మికులు మృతి చెందుతున్నారు. చాలా ఘటనల్లో మృతదేహాలు కూడా లభ్యమవ్వకపోవడం దారుణమైన విషయం. ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు దాదాపు 2,250 మంది ఇలా వలస వెళ్తూ పడవ ప్రమాదాల్లో మరణించినట్లు ఐఓఎం అధికార ప్రతినిధి చెప్పిన వివరాల ప్రకారం తెలుస్తోంది.