క్యాన్సర్ బారిన పడిన బ్రిటన్ రాజు ఛార్లెస్-III

-

బ్రిటన్ రాజు ఛార్లెస్-3 క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. ఇది ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కాదని సోమవారం జారీ చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. ఇటీవల విస్తరించిన ప్రోస్టేట్ కోసం చికిత్స తీసుకుంటున్న క్రమంలో క్యాన్సర్ విషయం బయటపడిందని తెలిపింది. క్యాన్సర్కు కింగ్ ఛార్లెస్-3 సోమవారం నుంచి సాధారణ చికిత్స తీసుకుంటున్నట్టు బకింగ్ హామ్ ప్యాలెస్ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు చెప్పింది.

ఛార్లెస్-3 పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూనే.. ఆయన త్వరలోనే విధుల్లోకి రావాలనుకుంటున్నారనీ ప్యాలెస్ అధికారులు తెలిపారు. అందుకోసమే చికిత్స సమయంలో బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నారని వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయన హాజరయ్యే అధికారిక కార్యక్రమాలు ఇతర సీనియర్ రాజ కుటుంబీకులు నిర్వర్తించనున్నట్లు సమాచారం. 2022 సెప్టెంబరులో తన తల్లి క్వీన్‌ ఎలిజబెత్‌-2 మరణించడం వల్ల ఛార్లెస్-3 బ్రిటన్ రాజుగా ఎన్నికైన విషయం తెలిసిందే.

జనవరి 29న లండన్ క్లినిక్ నుంచి డిశ్ఛార్జ్ అయిన తర్వాత ఆదివారం నార్ఫోక్‌లోని సాండ్రింగ్‌హామ్‌లో ఉన్న చర్చిలో కనిపించారు రాజు ఛార్లెస్-3. తాజాగా క్యాన్సర్ సోకిందని నిర్ధరణ కావడం వల్ల ఆయన సాండ్రింగ్‌హామ్ నుంచి లండన్కు బయలుదేరి ప్రస్తుతం లండన్లో చికిత్స తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version