రిషి సునాక్‌పై  మరోసారి విమర్శలు.. ఈసారి కారణమేంటంటే..?

-

బ్రిటన్‌ నూతన ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్‌ వరుస విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సుయెల్లా బ్రేవర్మన్‌ను తిరిగి హోం సెక్రటరీగా తీసుకోవడంపై ఆయనపై వ్యతిరేకత రాగా తాజాగా ఆయన తీసుకున్న మరో నిర్ణయంపై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే..?

ఈజిప్టు వేదికగా నవంబరు 6 నుంచి 18 వరకు పర్యావరణ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రధాని సునాక్‌ హాజరయ్యే అవకాశం లేదని డౌనింగ్‌ స్ట్రీట్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇతర సమావేశాలు, కార్యక్రమాల నేపథ్యంలో ఆయన ఈ సదస్సుకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక, బ్రిటన్‌ రాజు, ప్రముఖ పర్యావరణవేత్త ఛార్లెస్‌ 3 కూడా ఈ సదస్సులో పాల్గొనట్లేదని అక్టోబరు మొదటి వారంలో యూకే మీడియా వెల్లడించింది. అప్పటి ప్రధాని ట్రస్‌ సలహా మేరకు ఛార్లెస్‌ 3 ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఇప్పుడు ప్రధాని సునాక్‌ కూడా ఈ సదస్సుకు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో ఈజిప్టు ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. సునాక్‌ నిర్ణయం, బ్రిటన్‌ రాజు సదస్సుకు హాజరవకుండా యూకే ప్రభుత్వం ఒత్తిడి తేవడం వంటి పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. యూకే తీరు ఆందోళన కలిగిస్తోందని.. పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనే విషయంలో బ్రిటన్‌ చేతులు దులుపుకోవాలని చూస్తోందా? అని పలు దేశాధినేతలు ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version