భారత్​పై ఆరోపణలు నిజమని తేలితే పరిస్థితులు ఆందోళనకరంగా మారతాయి.. కెనడా మంత్రి కామెంట్స్

-

ఖలిస్థానీ అంశంతో భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ ఆ దేశ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఖలిస్థానీ వ్యవహారంలో ట్రూడో పార్టీ మిన్నకుండిపోయిందంటూ ఆ పార్టీ ఎంపీ చంద్ర ఆర్య సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇది మరవకముందే ఇప్పుడు కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ చేసిన తాజా కామెంట్స్ మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

భారత్‌తో బంధం తమకు ముఖ్యమైనదే అని పేర్కొంటూనే.. నిజ్జర్‌ హత్య కేసులో దర్యాప్తు తప్పకుండా కొనసాగుతుందని ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెనడా మంత్రి బిల్‌ బ్లెయిర్‌ తెలిపారు. అయితే, ఈ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఇది సవాల్‌తో కూడుకున్న సమస్యగా మారుతుందని.. అది తమకు తెలుసని.. కానీ తమ చట్టాలను గౌరవించడం, తమ పౌరులను రక్షించుకోవడం తమ ప్రభుత్వం బాధ్యత అని అన్నారు. అందుకోసం.. ఈ కేసులో క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి అసలు నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. భారత్‌పై కెనడా ప్రధాని చేసిన ఆరోపణలు నిజమైతే.. అది చాలా ఆందోళనకర అంశంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు

Read more RELATED
Recommended to you

Exit mobile version