హైదరాబాద్ నగరంలోని మెహీదిపట్నంలో విషాదం చోటు చేసుకుంది. లిప్ట్ లో ఇరుక్కొని నాలుగేళ్ల బాలుడు సురేందర్ మృతి చెందాడు. మొన్న నాంపల్లిలో లిప్ట్ ఘటన మరవక ముందే తాజాగా మెహిదీపట్నంలో చోటు చేసుకోవడం గమనార్హం. కేవలం 15 రోజుల వ్యవధిలోనే మరో పసి ప్రాణాన్ని నాసిరకం లిప్ట్ బలిగొంది. వివరాల్లోకి వెళ్లితే.. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో నాలుగున్నరేళ్ల చిన్నారి సురేందర్ లిప్ట్ లో ఇరుక్కొని మరణించడం విషాదం నింపింది. శ్యామ్ బహదూర్ నేపాల్ కి చెందిన వ్యక్తి. ఉపాధి కోసం 7 నెలల కిందట నగరానికి వచ్చాడు. తొలుత గుడిమల్కాపూర్ లో ఓ భవనానికి కాపలాదారుడిగా పని చేశాడు.
మూడు నెలల కిందట సంతోష్ నగర్ కాలనీలోని ముజ్తాబా అపార్ట్ మెంట్ కి వాచ్ మెన్ గా వచ్చాడు. రూమ్ ఇస్తామని చెప్పడంతో నేపాల్ నుంచి భార్య, కుమార్తె, కుమారుడిని తీసుకొచ్చాడు. ఆరు అంతస్తులున్న భవనంలో హాస్టల్ నిర్వహిస్తున్నారు. లిప్ట్ పక్కనే చిన్న గదిలో శ్యామ్ బహదూర్ కుటుంబం నివసిస్తోంది. సురేందర్ ఆడుకుంటూ లిప్ట్ దగ్గరకి వెల్లాడు. ఆ సమయంలో తలుపుల మధ్యకు వెళ్లగా.. పైన ఎవరో లిప్ట్ నొక్కారు. తలుపులు మూసుకోకముందే లిప్ట్ పైకి దూసుకెళ్లింది. దీంతో లిప్ట్ లోనే ఆ పసిప్రాణం నలిగిపోయింది.