అమెరికాలో పనిచేస్తున్న హెచ్-1బీ వీసాదారులకు కెనడా సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 10వేల మంది హెచ్-1బీ వీసాదారులు తమ దేశానికి వచ్చి ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా ఓపెన్ వర్క్-పర్మిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్ ప్రకటించారు. ఈ ప్రొగ్రామ్ కింద హెచ్-1బీ వీసాదారుల కుటుంబ సభ్యులు చదువుకోవడం, పనిచేసేందుకు అనుమతి కల్పించనున్నట్లు తెలిపారు.
‘‘హైటెక్ రంగాలకు చెందిన కొన్ని కంపెనీలు అమెరికా, కెనడా రెండు దేశాల్లోనూ పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీల్లో వేలాది మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో చాలా మంది హెచ్-1బీ వీసాదారులే. జులై 16, 2023 నాటికి హెచ్-1బీ వీసాలో అమెరికాలో పని చేస్తున్న వారు, ఈ వీసాదారులతో వచ్చే కుటుంబసభ్యులు కెనడాకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు’’ అని కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వ సేవల శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ కొత్త ప్రోగ్రామ్ కింద.. ఆమోదం పొందిన హెచ్-1బీ వీసాదారులకు మూడేళ్ల కాలావధితో ఓపెన్ వర్క్ పర్మిట్ లభిస్తుంది.