భారత్‌లో మరికొన్ని రోజుల్లో షాంఘై సహకార సంస్థ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు ప్రపంచ దేశాల నుంచి రక్షణ శాఖ మంత్రులు, ఇతర ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇందులో భాగంగానే చైనా రక్షణ శాఖ మంత్రి లీ షెంగ్‌ఫూ, రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగులు భారత్‌లో పర్యటించనున్నారు. వచ్చే వారం వీరిద్దరూ దిల్లీలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ఆ రెండు దేశాలు ధ్రువీకరించాయి.
ఎస్‌సీవో రక్షణ మంత్రుల సమావేశం ఏప్రిల్ 27, 28 తేదీల్లో జరగనుంది. ఈ సమావేశానికి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. ఉగ్రవాదం, ప్రాంతీయ భద్రత, అఫ్గానిస్థాన్‌లోని భద్రతా పరిస్థితి వంటి అంశాలపై చర్చించనున్నారు.
మరోవైపు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ను కూడా ఈ సదస్సుకు ఆహ్వానించారు. ఆయన పర్యటనపై పాక్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా రక్షణ మంత్రి భారత్‌ను సందర్శించడం ఇదే తొలిసారి.