ట్రంప్ కు షాక్.. అమెరికా అధ్యక్ష పదవికి అనర్హుడిగా కొలరాడో సుప్రీంకోర్టు

-

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు కొలరాడో సుప్రీం కోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కొలరాడో నుంచి పోటీ చేయకుండా ట్రంప్‌పై ఆ రాష్ట్ర సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసింది. ఈ తీర్పు ప్రభావం వచ్చే ఏడాది మార్చి 5వ తేదీన జరిగే కొలరాడో రిపబ్లికన్స్‌ ప్రైమరీ బ్యాలట్‌పై మాత్రమే కాకుండా నవంబర్‌ 5వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలపై కూడా తీవ్రంగా ఉండనున్నట్లు సమాచారం.

అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్‌ను అనర్హుడిగా ప్రకటించిన కోర్టు కొలరాడోలో ప్రైమరీ బ్యాలెట్‌ నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ పేరు తొలగించింది. అధ్యక్ష పదవి చేపట్టేందుకు ట్రంప్‌ అనర్హుడని 4-3మెజార్టీతో జడ్జిల తీర్పు వెలువరిస్తూ.. ఈ తీర్పుపై అప్పీల్‌ చేసుకునే అవకాశాన్ని ట్రంప్‌నకు కల్పించింది.

2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడి చేయడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించారని కొలరాడో సుప్రీంకోర్టు భావించింది. ఈ నేపథ్యంలో అమెరికా రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం అమెరికా అధ్యక్ష పదవి చేపట్టేందుకు ట్రంప్‌ అనర్హుడని ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న ఓ వ్యక్తిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news