పరారీలో ఉన్న అండర్‌వరల్డ్ డాన్, ముంబయి పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగినట్లు సమాచారం. ఆయన తీవ్ర అనారోగ్యంతో పాకిస్థాన్లోని కరాచీలోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. భారీ భద్రత నడుమ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వైద్యులు, అతడి కుటుంబ సభ్యులను మాత్రమే ఆస్పత్రిలోకి అనుమతిస్తున్నారట.
ఈ ఘటనకు సంబంధించి ముంబయి పోలీసులు దావూద్ బంధువుల దగ్గరి నుంచి మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. దావూద్ మరో రెండ్రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోనున్నట్లు సమాచారం. అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆస్పత్రి లోపల దావూద్ ఇబ్రహీం కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్యలో చికిత్స పొందుతున్నాడు.ఒక ఫ్లోర్ మొత్తం దావూద్ ఒక్కడే ఉన్నట్లు తెలిసింది. అతన్ని చూడటానికి కుటుంబసభ్యులు, ఆస్పత్రి ఉన్నతాధికారులకు మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు దావూద్ రెండో వివాహం చేసుకున్న అనంతరం కరాచీలో ఉంటున్నట్లు అతని సోదరి ఎన్‌ఐఏకు వెల్లడించారు. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులు.. పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవాలని ప్రయత్నించినట్లు ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌లో పేర్కొంది.