గయానాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాల వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 19 మంది విద్యార్థులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. గయానా రాజధాని జార్జ్‌టౌన్‌కు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహ్‌దియా పట్టణంలోని ఓ సెకండరీ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది.
పాఠశాల వసతి గృహంలో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయని స్థానిక ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. బాధితులంతా 12- 18 ఏళ్ల పిల్లలేనని, ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొంది. ఘటనాస్థలిలోనే 14 మంది విద్యార్థులు మరణించారని.. స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరో ఐదుగురు చనిపోయారని వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్లు వివరించింది.
పాఠశాల వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంపై గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు పూర్తి స్థాయిలో మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనేక మంది విద్యార్థులు స్థానికంగా చికిత్స పొందుతున్నారని, ఏడుగురిని రాజధానికి తరలించినట్లు అధికారులు తెలిపారు.