తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత ఇజ్రాయెల్ గాజాపై మరింత తీవ్రంగా విరుచుకు పడుతోంది. భీకర దాడుల్లో గాజా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మరోవైపు బతికున్న వారు ఆకలితో అలమటిస్తున్నారు. గాజాలో ఆహారం, నీరు, మందులు, కరెంట్ కొరతతో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. గుక్కెడ మంచినీళ్ల కోసం లక్షలాది మంది వేయికళ్లతో పడిగాపులు కాస్తున్నారు. ఔషధాల కొరత ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నిత్యావసరాల కోసం ఒక్కసారిగా పోటెత్తుతుండటంతో తొక్కిసలాట జరిగింది. మానవతాసాయం ట్రక్కుల్లోని మంచి నీళ్ల బాటిళ్ల కోసం పెద్దలు, చిన్న పిల్లలు గుంపులుగా ఎగబడటం అక్కడి ప్రజల దుర్భర పరిస్థితికి అద్దం పడుతోంది.
గాజాలో ప్రస్తుతం తీవ్రమైన ఆహార సంక్షోభం తలెత్తింది. గాజాలోకి వచ్చిన మానవతా సాయం ట్రక్కులపై గుంపులుగా ఎగబడిన ప్రజలు ట్రక్కుల్లోని సామగ్రిని అందినకాడికి తీసుకపోతున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు ఎడతెరిపి లేకుండా సాగుతుండటం వల్ల గాజాలో మానవతాసాయానికి అంతరాయం ఏర్పడుతోంది. తుపాకీ మోత మధ్యే ప్రజలు నీళ్ల ట్రక్కులపై ఎగబడుతున్నారు. గాజాలోఎక్కడ చూసినా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.